హైదరాబాద్,అర్జున్ సమాచారం:
జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు గోల్కొండ నుంచి లాల్‌దర్వాజా వరకు బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు.
బోనాల ఉత్సవాల నిమిత్తం 3427 దేవాలయాలకు 15 కోట్ల 5 లక్షల 41 వేల 150 రూపాయలు విడుదల.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారుల సమన్వయం హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.
తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలతో ప్రారంభం
జూలై 20,21,22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఉత్సవాల్లో భాగంగా 20 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం,21న అమ్మవారికళ్యాణం, 22 న రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.
ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాలు,ఆగస్టు 3న రంగం కార్యక్రమం
ఆగస్టు 9న హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల తో పాటు, నగరంలోని ప్రధాన దేవాలయాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖ, ట్రాన్స్‌కో, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, పౌర సరఫరాల శాఖ, టీజీఎస్‌ఆర్టీసీ, రైల్వే, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ, పురావస్తు శాఖతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సులను నడిపిస్తున్నందున రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు