ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 5:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

నిజామాబాద్, జూలై  18,అర్జున్ సమాచారం:

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RWS, మిషన్ భగీరథ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
వర్షాకాలంలోనూ తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే, మిషన్ భగీరథ పైప్‌లైన్‌లలో లీకేజీలు, ఇతర సాంకేతిక సమస్యలు ఎక్కడా లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.మరమ్మత్తులు అవసరమైన చోట వెంటనే పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు.

నీటి వృథాను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే భూగర్భ జలమట్టం పెరిగేలా నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.
తాగునీటి సరఫరాలో సమయపాలన పాటించాలని, ప్రతి గ్రామానికి నిర్ణీత సమయానికి నీటిని అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాగునీటి నాణ్యతపై నిరంతరం క్వాలిటీ చెకింగ్ నిర్వహించాలని, శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకులను గుర్తించి తగిన మరమ్మత్తులు చేయాలని సూచించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న వాటర్ ట్యాంకులను వెంటనే డిస్మెంటల్ చేసి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా చూడాలని అన్నారు.

ప్రజల నుంచి తాగునీటి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులకు ఎలాంటి పరిపాలనా లేదా సాంకేతిక సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే తాగునీటి సరఫరాలో అలసత్వం, నిర్లక్ష్యం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో RWS (మిషన్ భగీరథ) ఈఈలు కే. రాకేష్, నరేష్ బాబు, డీఈఈలు నవీన్ రెడ్డి, కౌశిక్, వెంకటేశ్వర్ గౌడ్, ఏడు మండలాల ఏఈఈలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.