ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 10:41 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

క్యాబినెట్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 24,అర్జున్ సమాచారం:

పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపేలా చట్టాన్ని మరింత బలోపేతం చేసే సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పేపర్ లీక్ కేసుల దర్యాప్తు, విచారణను తప్పనిసరిగా మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులకు చట్టబద్ధ హోదా కల్పించనున్నారు. అలాగే వ్యవస్థీకృత పేపర్ లీక్ సిండికేట్‌లకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా నిబంధనలు తీసుకురానున్నారు.కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం రాష్ట్రాల మధ్య పనిచేస్తున్న పేపర్ లీక్ మాఫియాలను పూర్తిగా నిర్మూలించడం, ప్రభుత్వ పరీక్షలపై విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం. ప్రస్తుతం ఇలాంటి కేసులు సంవత్సరాల తరబడి కోర్టుల్లో కొనసాగుతుండగా, ఇకపై ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులు మూడు నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేసి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో నిందితులకు త్వరితగతిన శిక్ష పడటంతో పాటు పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన పేపర్ లీక్ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థుల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో పరీక్షల భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే 2024లో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టాన్ని మరింత కఠినతరం చేసే సవరణలను కేంద్రం సిద్ధం చేసింది.
===============================