ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 8:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు పోలీసుల భద్రత కూడా ముఖ్యమే దాన్ని ఎవరికీ నిరాకరించే అవకాశం లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

న్యూ డిల్లి, జులై 27,అర్జున్ సమాచారం:

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎవరికీ నిరాకరించే అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆందోళనలు జరుగుతున్నాయనే కారణంతో పోలీసులు అతిగా బలప్రయోగం చేయడాన్ని సమర్థించలేమని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనల నిర్వహణకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా వెల్లడించింది. నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల వ్యవస్థలో అక్రమాలపై విద్యార్థులు చేపట్టిన నిరసనల సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్‌, టియర్‌గ్యాస్‌ ప్రయోగించారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
‘శాంతియుత నిరసన హక్కు రాజ్యాంగంలో పొందుపరచబడింది. అది సంపూర్ణంగా హామీ ఇవ్వబడిన హక్కు. దాన్ని ఎవరూ నిరాకరించలేరు. కేవలం ఆందోళనలు జరుగుతున్నాయనే కారణంతో పోలీసుల అతిగా బలప్రయోగాన్ని సమర్థించలేం. ఎవరైనా శాంతియుతంగా ఆందోళన చేయాలనుకుంటే అందుకు ఒక నిర్దిష్ట ప్రోటోకాల్‌ ఉండాలి. అలాంటి నిరసనలకు తగిన స్థలాన్ని కూడా కల్పించాలి. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే సంఘవిద్రోహ శక్తులు చొరబడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా వర్తించే అంశం. ఒకే విధమైన ప్రోటోకాల్‌ అవసరం ఉంది. ఎవరి బాధ్యతలు ఏమిటి? ఎలాంటి తప్పనిసరి మార్గదర్శకాలు ఉండాలి? అనే విషయాలను పరిశీలిస్తాం. ఈ ప్రక్రియలో స్వీయ క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమైనది” అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు.

పోలీసుల భద్రత కూడా ముఖ్యమే

విచారణ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాదులు గోపాల్‌ శంకరనారాయణన్‌, కాలిన్‌ గోన్సాల్వెస్‌, వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. మరోవైపు విచారణ సందర్భంగా నిరసనల్లో కొందరు పోలీసు సిబ్బందిపై కూడా దాడులు జరిగాయని ఒక న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జోయ్‌మాల్య బాగ్చి, “వారు ఎవరైనా సరే, ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదే. పోలీసు సిబ్బంది భద్రత కూడా అంతే ముఖ్యమైనది. వారికి తగిన భద్రత ఎందుకు కల్పించలేదో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరే అంశాన్ని కూడా పరిశీలిస్తాం” అని అన్నారు. పోలీసుల కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్‌ను కూడా ఇతర పిటిషన్లతో కలిసి విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
===========================