ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 2:01 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రహదారి భద్రతను మరింత కట్టుదిట్టంఅక్రమ పార్కింగ్‌ పై   కఠిన చర్యలు

 రహదారి భద్రతను మరింత కట్టుదిట్టం
అక్రమ పార్కింగ్‌ పై   కఠిన చర్యలు

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ హెచ్చరిక

మహబూబాబాద్,( అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు,1)

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) శంకర్ నాయక్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, మహబూబాబాద్ జిల్లా గుండా వెళ్లే రెండు జాతీయ రహదారుల వెంట రహదారి భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
జిల్లా గుండా వెళ్లే రెండు జాతీయ రహదారుల వెంట ఉన్న భోజనశాలలు, హోటళ్లు, విశ్రాంతి కేంద్రాల వద్ద లారీలు, బస్సులు, ట్రాక్టర్లు తదితర భారీ వాహనాలను రాత్రి వేళల్లో నిర్లక్ష్యంగా నిలిపివేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రహదారి పక్కన నిలిపిన వాహనాలకు వెనుక భాగంలో ఎరుపు ప్రతిబింబించే పట్టీలు లేదా ప్రతిబింబించే పలకలు, నిలుపుదల దీపాలు, హెచ్చరిక త్రిభుజ గుర్తులు లేకపోవడం వల్ల వేగంగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలిపారు. డ్రైవర్లు, వాహన యజమానులు తప్పని సరిగా భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. మోటారు వాహనాల చట్టం–1988, సెక్షన్ 122 ప్రకారం జాతీయ రహదారులపై అకారణంగా లేదా ఇతరులకు ప్రమాదం కలిగే విధంగా వాహనాలను నిలిపి వేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. అలాంటి వాహనాల ఛాయాచిత్రాలు, దృశ్యాల ఆధారంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా వాహనాలు నిలిపివేయరాని ప్రాంతాల్లో వాహనాలను నిలిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రహదారిపై నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేయడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే కఠిన చర్యలు తప్పవన్నారు. రవాణా శాఖ సూచనలు మహబూబాబాద్ జిల్లా గుండా వెళ్లే రెండు జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితులు మినహా వాహనాలను నిలిపి వేయరాదు. వాహనాలను భోజనశాలలు, హోటళ్ల ముందు లేదా రహదారి అంచున ప్రమాదకరంగా నిలిపివేయరాదని, తప్పని సరిగా ఆపాల్సి వస్తే రహదారికి సురక్షితమైన దూరంలో మాత్రమే నిలిపివేయాలని, వాహనం వెనుక భాగంలో ఎరుపు ప్రతిబింబించే పట్టీలు లేదా ప్రతిబింబించే పలకలు, ప్రతిబింబించే పట్టీ, నిలుపుదల దీపాలు తప్పనిసరిగా ఉండాలి.
రాత్రి సమయంలో ప్రతిబింబించే హెచ్చరిక త్రిభుజ గుర్తు ఏర్పాటు చేయాలని, వాహనాల సాంకేతిక సామర్థ్య ధ్రువీకరణ (ఫిట్‌నెస్), బ్రేకులు, టైర్లు, దీపాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిరంతరం పరిశీలించాలి.
అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం పూర్తిగా నివారించాలని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం ద్వారా ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ రహదారులపై డీటీవో శంకర్ నాయక్ మాట్లాడుతూ, “మహబూబాబాద్ జిల్లా గుండా వెళ్లే రెండు జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రతే మా ప్రధాన లక్ష్యం. వాహన యజమానులు, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.