ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 4:24 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు

ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు

విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలి: ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 01:

ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది హెచ్చరించారు. శనివారం మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ మంథని ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్‌పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూజీసీ మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక చట్టాలు, మార్గదర్శకాలు అమలులో ఉన్నాయని తెలిపారు. కళాశాల ప్రాంగణంలో గానీ, బయట గానీ తోటి విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు విధిస్తారని హెచ్చరించారు. ర్యాగింగ్ అనేది అమానవీయమైన, అనైతిక చర్య అని, భారతీయ సంస్కృతిలో ఇలాంటి చర్యలకు స్థానం లేదని పేర్కొన్నారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో, చట్టబద్ధంగా మెలగాలని సూచించారు.

బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె. రఘోతం రెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్ పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన దురాచారమని, ప్రతి ఒక్కరూ చట్టబద్ధమైన పౌరులుగా ఇతరుల హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలని కోరారు. అలాగే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర సుధారాణి, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి అనురాధ, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కటకం శ్రీనివాస్, న్యాయవాదులు శశిభూషణ్ కాచే, నూనేటి ఆంజనేయులు, సీఐ బుద్దే స్వామి, ఎస్ఐ టి. శ్రీనివాస్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణ ప్రణీత్, జేఎన్‌టీయూ ఫిజికల్ డైరెక్టర్ పింగిలి కృష్ణారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.