న్యూఢిల్లీ, ఆగస్టు 6,అర్జున్ సమాచారం:
మయన్మార్ సరిహద్దుల్లో దశాబ్దాలుగా గుర్తించని వివాదాస్పద ప్రాంతాల పరిష్కారం కోసం భారత్ భూభాగ మార్పిడి ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘సరిహద్దులో ఇంకా పరిష్కరించని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి… ఆయా అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు. మణిపూర్ సరిహద్దుల వెంబడి మయన్మార్‌తో భూ మార్పిడికి భారత్ సిద్ధమవుతోందన్న నివేదికలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయనే ఈ నివేదికలను ఆయన పరోక్షంగా అంగీకరించారు.దీనిపై అమెరికాకు చెందిన ‘ది డిప్లొమాట్’ పత్రిక కొద్ది వారాల కిందట కథనం ప్రచురించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్-మాయన్మార్ సరిహద్దులోని పిల్లర్ 65 నుంచి 68 మధ్య ఉన్న సుమారు 2.8 కిలోమీటర్ల పరిధిలోని 1.4 చదరపు మైళ్ల భూభాగాన్ని మార్పిడి చేసుకోవడం ద్వారా సరిహద్దు గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని భారత ప్రభుత్వం ఒక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అధికారిక పత్రాలను ఉటంకిస్తూ జులై 17న సదరు పత్రిక నివేదించింది. భూ మార్పిడి కోసం ప్రతిపాదించిన ప్రాంతం మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో, మయన్మార్‌లోని సగైంగ్ ప్రాంతంలో ఉన్న కబావ్ లోయకు ఆనుకొని ఉంది. మే 26, 2026 నాటి అధికారిక పత్రం ప్రకారం, సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియ మూడు నెలల్లో అంటే సుమారుగా ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది.భారత్, మయన్మార్‌లు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం గుండా మయన్మార్‌లోని సగైంగ్ ప్రాంతం, చిన్ రాష్ట్రాల్లోకి ప్రవేశించే 1,643 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ సరిహద్దులో మెజార్టీ ప్రాంతం కొండలు, అడవులతో నిండి ఉండి చొరబాట్లకు అనుకూలంగా ఉంటుంది. ఇరువైపులా చారిత్రాత్మకంగా ఒకే వర్గానికి చెందిన గిరిజన జాతులు నివాసం ఉంటున్నారు. కేంద్ర హోం శాఖ ప్రకారం.. పిల్లర్ల ద్వారా సుమారు 1,472 కిలోమీటర్ల సరిహద్దును నిర్ధారించారు. అయితే, ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ సెక్టార్, మణిపూర్‌లోని కబావ్ లోయలో దాదాపు 171 కిలోమీటర్ల సరిహద్దు ఇంకా పరిష్కారం కాలేదు.‘ది డిప్లొమాట్’ ప్రకారం.. భారత్-మయన్మార్ సరిహద్దులో ఇంకా అపరిష్కృతంగా ఉన్న ప్రాంతంలో గుర్తింపు నిర్ధారణను వేగవంతం చేయడమే భూభాగ మార్పిడి వెనుక ఉద్దేశం. దీనివల్ల సరిహద్దు పొడవునా కంచె నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోతాయి. తత్ఫలితంగా అక్రమ వలసలు, తిరుగుబాటుదారుల కదలికలు, ఇతర సరిహద్దు నేరాలను అరికట్టడానికి వీలు కలుగుతుంది.మయన్మార్ వెంబడి 1,643 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కంచె ప్రణాళికను 2024లో భారత్ ప్రకటించింది. అదే సమయంలో 2018 నుంచి అమల్లో ఉన్న భారత్-మయన్మార్ సరిహద్దు స్వేచ్ఛా రాకపోకల విధానాన్ని కూడా రద్దు చేసింది. ఈ విధానం ప్రకారం.. సరిహద్దు సమీపంలో నివసించే గిరిజన వర్గాలు, బోర్డర్ పాస్ ఉపయోగించి వీసా లేకుండా ఒకరి భూభాగంలోకి మరొకరు 16 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి అనుమతి ఉండేది.ప్రస్తుత భారత్-మయన్మార్ సరిహద్దును 1967 ద్వైపాక్షిక ఒప్పందం కింద నిర్వచించారు. కానీ దానిలోని కొన్ని భాగాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. అపరిష్కృత ప్రాంతాలను ద్వైపాక్షిక సరిహద్దు యంత్రాంగం ద్వారా నిర్ధారిస్తామని, ఇందులో భాగంగా తొమ్మిది పిల్లర్లు గుర్తించి, ఏర్పాటు చేస్తామని 2018లో పార్లమెంట్‌కు కేంద్రం తెలిపింది.మణిపూర్‌లోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లోని 64-68 పిల్లర్ల మధ్య ఉన్న మోల్చామ్ సెక్టార్, 75- 79 పిల్లర్ల మధ్య ఉన్న మోరే సెక్టార్, 88-95 మధ్య ఉన్న చోరో ఖునౌ సెక్టార్ కీలకమైనవి. మయన్మార్‌తో విస్తృతమైన సరిహద్దు వివాదం ఏదీ లేదని, కేవలం తొమ్మిది పిల్లర్లు మధ్య ప్రాంతాలపై మాత్రమే ద్వైపాక్షిక యంత్రాంగాల ద్వారా పరిష్కరిస్తున్నామని భారత్ తరుచూ చెబుతోంది.అయితే, పొరుగు దేశాల మధ్య భూభాగ మార్పిడి అసాధారమైంది ఏమీ కాదు. 2015లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన భూ సరిహద్దు ఒప్పందం ద్వారా న్యూఢిల్లీ తన భూభాగంలోని 111 ఎన్‌క్లేవ్‌లను ఢాకాకు బదిలీ చేసి, బదులుగా 51 బంగ్లాదేశ్ ఎన్‌క్లేవ్‌లను పొందింది. దీంతో 41 ఏళ్ల నాటి సరిహద్దు వివాదం ముగిసింది. అయితే, ఈ ప్రతిపాదన మణిపూర్‌లో ఇప్పటికే వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ‘ది డిప్లొమాట్’ నివేదిక తర్వాత స్థానిక ఇంఫాల్ టైమ్స్ కథనం ప్రకారం.. మణిపూర్ సమగ్రతా సమన్వయ కమిటీ కేంద్రానికి తీవ్ర హెచ్చరికలు చేసింది. తమ రాష్ట్ర భూభాగంలో చిన్న భాగాన్ని కూడా మయన్మార్‌కు అప్పగించవద్దని, ఒకవేళ అటువంటి ప్రతిపాదనను అమలు చేస్తే, ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ‘కొకొమి’ స్పష్టం చేసింది
===============