కరీంనగర్,అర్జున్ సమాచారం:
స్థానిక కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఎస్సి ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో “ప్రపంచ ఆదివాసీ దినోత్సవ” వేడుకలు శుక్రవారం రోజున ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగాయి. సెల్ డైరెక్టర్, ఆర్ట్స్ లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పద్మావతి అధ్యక్షతన అమరవీరులు, గిరిజన పోరాట యోధులు కొమురం భీమ్, రాంజీ గోండ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, భాషలు, ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని, విద్యార్థులు వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ పెద్దపల్లి మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణలో, సాంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడటంలో ఆదివాసీల పాత్ర అమూల్యమైనదని, గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధనలు,నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన సామాజిక వికాసం సాధ్యమవుతుందని అన్నారు.
శాతవాహన విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ వెనుకబడిన, గిరిజన విద్యార్థుల సంక్షేమం మరియు అభ్యున్నతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
విశిష్ట అతిథిగా డాక్టర్ డి. హరికాంత్ వైస్ ఛాన్సలర్ ఓఎస్డీ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో గిరిజన విద్యార్థుల పురోగతికి, వారి ఆచారాలు సంస్కృతి ని కాపాడి వారికి రాజ్యాంగబద్ధమైన అవకాశాలు కల్పించడానికి పరిపాలనాపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రత్యేక అతిథులు డాక్టర్ ఎన్. వి. శ్రీరంగ ప్రసాద్, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గిరిజన యువతలో వ్యాపార, ఆర్థిక స్వయం సమృద్ధి సాదించాలన్నారు.
సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాకాంత్ మాట్లాడుతూ ఆదివాసీల జీవనశైలిలోని పర్యావరణ అనుకూల విధానాలను మనము తెలుసుకొని వాటిని గౌరవించాలని అన్నారు.
అసిఫాబాద్ సిర్పూర్ డివిజన్లోని కొలం తెగ కళాకారుల గుస్సాడీ బృందం విశ్వవిద్యాలయానికి విచ్చేసి తమ సాంప్రదాయ నృత్యంతో విద్యార్థులకు వారి ఆచార వైభవాలను గురించి తెలియజేయడం ఈ కార్యక్రమంలో కోసమెరుపు.
విశ్వవిద్యాలయాలలోని వివిధ విభాగాలలోని ఆదివాసి వివిధ తెగలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తమంతము పరిచయం చేసుకొని తమ తెగ యొక్క ఆచారాలు వాటి వ్యవహారాలు వాటి సంస్కృతి సాంప్రదాయాల గురించి అందరు విద్యార్థులకు సభాముఖంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా. సరసిజ, డా. మునావర్, డా. శ్రీవాణి, డా. యశ్వంత్ అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు ఆదివాసి అన్ని తెగల విద్యార్థులు కలసి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
==============================