ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:14 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

చేయూత కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదు గతంలో అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే కొత్త పింఛన్లు ఆగస్టు 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

 అర్జున్ సమాచారం:                                                                                                                                                                                                                                      అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిదశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.
కొత్త పింఛన్ల కోసం అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ఎలిజిబిలిటీ క్రైటీరియానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకుంటోంది. 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారమే అర్హతను పరిశీలిస్తారు.
ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో దరఖాస్తు చేసి, అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అవసరమైన పత్రాలు సమర్పించని వారు లేదా ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అర్హులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత నిర్ధారణ కోసం సంబంధిత శాఖల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు. వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు సెపరేషన్ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు చేనేత-జౌళి శాఖ ధ్రువీకరణ, ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ అవసరం.
దరఖాస్తుల పరిశీలన అనంతరం నిర్దేశిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపి, జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తారు.
ప్రతి అర్హుడికి చేయూత అందించాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు కూడా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ప్రతి అర్హత కలిగిన వితంతువు, ఒంటరి మహిళకు దరఖాస్తు చేసుకోవడం, అవసరమైన ధ్రువపత్రాలు పొందడంలో సహకరించాలని సూచించారు.
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆగస్టు 31, 2026 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తులతో పాటు వివరాలను చేయూత పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా వెంటనే చేపట్టనున్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఉన్న అర్హత నిబంధనలనే కొనసాగిస్తూ, అర్హులైన వారికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్ర‌భుత్వం ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది.
=============================