ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 7:47 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

172 దేశాలకు ఈ-వీసా వ్యవస్థ!

న్యూఢిల్లీ, ఆగస్టు 12,అర్జున్ సమాచారం:
భారత్‌ను సందర్శించే అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ప్రముఖ అట్టారీ ల్యాండ్ పోర్టుతో పాటు మరో 10 అంతర్జాతీయ కేంద్రాలోకి ఈ-వీసా హోల్డర్లకు ప్రవేశాన్ని కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నూతన నోటిఫికేషన్ విడుదల చేసింది. తొమ్మిది ల్యాండ్ పోర్టులు, రెండు విమానాశ్రయాలను ఈ జాబితాలో చేర్చడంతో.. దేశవ్యాప్తంగా ఈ-వీసా ద్వారా భారత్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఉన్న అంతర్జాతీయ కేంద్రాల సంఖ్య ఏకంగా 88కి చేరింది.కేంద్రం తాజాగా విడుదల చేసిన సవరించిన నిబంధనల ప్రకారం.. విదేశీ ప్రయాణికులకు ప్రవేశం కల్పించే మొత్తం 88 కేంద్రాలలో 37 విమానాశ్రయాలు, 38 ఓడరేవులు, 13 ల్యాండ్ పోర్టులు ఉన్నాయి. అయితే కొత్తగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి విమానాశ్రయాలను కొత్తగా ఈ-వీసా జాబితాలో చేర్చారు. అలాగే కొత్తగా పంజాబ్‌లోని అట్టారీతో పాటు రక్సాల్, రూపైడిహా, జోగ్బానీలతో పాటు దర్రంగా, గెడే, ఘోజాదంగా, హరిదాస్‌పూర్, జైగావ్, డావ్కీ, మోరే సరిహద్దు ప్రాంతాలను ఈ-వీసా చెక్‌పోస్టులుగా గుర్తించారు.విదేశీయులకు ఈ-వీసా నిబంధనలను ఎంతగా సడలించినప్పటికీ.. పాకిస్థాన్ పౌరులకు మాత్రం ఈ సదుపాయాన్ని దూరంగా ఉంచారు. పాకిస్థానీ పాస్‌పోర్టు కలిగిన వ్యక్తులకు లేదా పాకిస్థానీ మూలాలు ఉన్న ప్రయాణికులకు భారత్ ఎలాంటి ఈ-వీసాలను మంజూరు చేయడం లేదు. అలాంటివారు సాధారణ పద్ధతిలోనే విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్ ద్వారా నేరుగా రెగ్యులర్ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఈ-పోర్టల్ స్పష్టం చేసింది.భారత వీసా నిబంధనలను సులభతరం చేస్తూ 2014లో కేవలం 43 దేశాల పౌరుల కోసం ప్రారంభించిన ఈ-వీసా సేవలు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 172 దేశాల పౌరులకు అందుబాటులోకి వచ్చాయి. టూరిస్ట్, బిజినెస్, మెడికల్, స్టూడెంట్, గ్రూప్ ట్రావెల్, క్రూయిజ్, ట్రాన్సిట్, పర్వతారోహణతో సహా మొత్తం 17 వేర్వేరు సబ్-కేటగిరీలకు ఈ-వీసా సౌకర్యాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ-వీసాల కోసం దాఖలయ్యే దరఖాస్తుల్లో దాదాపు 95 శాతానికి పైగా అప్లికేషన్లను కేవలం 72 గంటల వ్యవధిలోనే ప్రాసెస్ చేసి అధికారులు క్లియరెన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం అట్టారీ వంటి కీలక ల్యాండ్ పోర్టులతో పాటు భోపాల్, తిరుపతి విమానాశ్రయాలకు ఈ-వీసా ఎంట్రీ హోదా దక్కడంతో విదేశీ పర్యాటకులు, వ్యాపారవేత్తలకు రవాణా మరింత సులభతరం కానుంది.
========================