ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 9:20 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అత్యుత్తమ దానం – అవయవ దానం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళి మోహన్

మహబూబాబాద్,అర్జున్ సమాచారం:
జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ సందర్భంగా  గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి   సంస్థ కార్యదర్శి శ్రీమతి షాలిని షాకెళ్లి అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి  మరియు సంస్థ చైర్మన్ కె. మురళి మోహన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.   న్యాయ మూర్తి మాట్లాడుతూ.. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడు పడవోయ్’ అన్న గురజాడ  మాటలకు నిలువెత్తు నిదర్శనం అవయవ దానమని, ఒకరి చిన్న త్యాగం మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుందని  పేర్కొన్నారు.”బ్రెయిన్ డెడ్ (మస్తిష్క మరణం) పొందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు ధైర్యంతో ముందుకు వచ్చి అవయవ దానానికి అంగీకరిస్తే, ఎంతోమంది నిరాశలో ఉన్న బాధితులకు నూతన జీవితాన్ని అందించవచ్చని తెలిపారు.
అవయవ దానం పట్ల సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలను తొలగించి, ప్రతి ఒక్కరూ దీనిపై విస్తృత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
‘మానవ అవయవాల మార్పిడి చట్టం’  మరియు అవయవ దాన నమోదు ప్రక్రియపై న్యాయపరమైన అంశాలను వివరించారు.  అననంతరం  అవయవ దానం ద్వారా కాలేయ మార్పిడి జరిగినటువంటి గ్రహీత పరకాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అవయవాల కోసం ఎదురు చూసే వారికి జీవన్ దాన్  సంస్థ వరం లాంటిదాన్నారు. హైదరాబాద్ లోని నిమ్స్ కేంద్రంగా ఇది పనిచేస్తుండగా అవయవం అవసరమైన వారు జీవన్ దాన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని తెలియచేశారు. అనంతరం న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ..పుట్టుక నీది చావు నీది, బ్రతుకంతా సమాజానిది’ అన్న కాళోజీ  మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని బ్రతికి ఉన్నంత కాలం సమాజానికి సేవ చేయడమే కాక, మరణానంతరం కూడా తన అవయవాల ద్వారా మరొకరి శరీరంలో జీవాన్ని నిలపడం కంటే పెద్ద సమాజ సేవ మరొకటి ఉండదన్నారు.ఈ సందర్భంగా అవయవ దానం, నేత్ర దానం మరియు శరీర దానం  చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సమ్మతి పత్రాలను  పూరించి అందించిన ఉదార స్వభావులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ప్రత్యేకంగా అభినందించారు. వారి సామాజిక బాధ్యతను, దేశభక్తిని కొనియాడుతూ వారికి ‘జాతీయ జెండా’ను ప్రశంసా పూర్వకంగా  అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో   న్యాయమూర్తులు శ్రీమతి స్వాతి మురారి , అర్వపల్లి కృష్ణతేజ్,  కోర్ట్ సిబ్బంది, సమన్వయ అధికారి,కోర్టు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్స్, పారా లీగల్ వాలంటీర్స్  పాల్గొన్నారు
==========================