స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగురవేసారు. తరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భాషలు, సంస్కృతులు వేరైనా, భారతీయత అనే భావన మనందరినీ కలిపి ముందుకు నడిపిస్తోంది. 150 కోట్ల జనాభా కలిగిన దేశం మనది. స్వాతంత్య్రం సాధించిన తరువాత దేశం బాగుపడాలని ఆనాటి సమరయోధులు ఆశించారు. కానీ, ఎనిమిది దశాబ్దాలైనా వాళ్లు ఆశించిన అభివృద్ధి జరగలేదని అన్నారు.
మన దేశంలో రోడ్లు, కరెంట్, నీళ్లు, పాఠశాల సౌకర్యం లేని గ్రామాలు ఇంకా ఉండటం బాధాకరం. సాగునీటి సమస్యతో నేటికీ రైతులు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పాలకులు జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానిస్తున్నారు. భారతదేశంలో ప్రతి ఎకరానికి సాగునీళ్లు అందాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నా వాటిని వాడుకోవడంలో పాలకులు విఫలమయ్యారు.40 ఏళ్లలో చైనా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగిందో మన కళ్లముందే ఉంది. మనకు చైనా కన్నా ఎక్కువ వనరులు ఉన్నాయి. కానీ.. పరిపాలించే వారికి దేశం గూర్చి అవగాహన లేకపోవడం వల్లే ఈ సమస్య. మన కంటే బలహీనంగా ఉన్న దేశాలతో పోల్చి మభ్యపెడుతున్నారు. మనం శ్రీలంక కంటే గొప్పగా లేము. దేశం బాగుపడాలంటే మన ఇంటి నుంచే పని ప్రారంభం కావాలి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు తెలంగాణ అభివృద్ధిపై ఏం ఆలోచన ఉంటుంది.. ఆయన ఏనాడూ జై తెలంగాణ అనలేదు. కల్యాణలక్ష్మిపై కౌంటర్ దాఖలు చేసే టైమ్ కూడా ఈ ప్రభుత్వానికి లేదా? కాంగ్రెస్ 60 ఏళ్ల కాలంలో కరెంట్ లేదు.. కేసీఆర్ గారు రాగానే 24 గంటల విద్యుత్ ఇచ్చారు. ఇవాళ పల్లె నుంచి పట్నం దాకా ప్రజలంతా కేసీఆర్ గారి పాలనను గుర్తుచేసుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో మళ్లీ కరెంట్ కూడా ఉండటం లేదు. కేంద్రం డబుల్ ఇంజన్ సర్కార్ అంటోంది. బీఆర్ఎస్ పాలనలో.. తెలంగాణ సింగిల్ ఇంజన్ అన్నింటికన్నా వేగంగా దూసుకుపోయింది. 18 గంటలు పని చేస్తున్నామని రేవంత్ అంటున్నాడు. వాళ్ల అనుముల అన్నదమ్ములను అదానీ స్థాయికి తీసుకుపోవడానికా? తెలివి లేని వాళ్లు తెలంగాణ దివాళా తీసింది అంటున్నారు. త్వరలో జిల్లాల్లో పార్టీ యాక్టివిటీ పెంచుదాం… ప్రతి రోజు కార్యక్రమాలు చేద్దాం.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుందాం.. ఒకనాడు టీఆర్ఎస్ కార్యాలయానికి భవనాలు అద్దెకు ఇవ్వడానికి భయపడ్డారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చిన జలదృశ్యం నుంచే మన పార్టీ ప్రస్థానం మొదలైంది. మన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కట్టి సరిగ్గా 20 ఏళ్లు. తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు నిరంతరం స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ అద్భుత నిర్మాణం జరిగింది. ఈ భవనం… తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక. ఈ భవన నిర్మాణంలో శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మళ్లీ పట్టాలెక్కుతుంది. జాతి నిర్మాణానికి మనమంతా పునరంకితమవుదామని అన్నారు.