న్యూఢిల్లీ, ఆగస్టు 15,అర్జున్ సమాచారం:
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ భవిష్యత్ అభివృద్ధికి కీలకమైన ఏడు రంగాలను ‘శక్తి సప్తధార’గా అభివర్ణించారు. దేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ ఏడు శక్తులను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. తయారీ రంగం, రైతులు, సాంకేతికత, గతిశక్తి, రక్షణశక్తి, హరిత ఇంధనం, సాఫ్ట్ పవర్‌ను భారత్ బలాలుగా పేర్కొన్నారు. ఈ రంగాల్లో వేగంగా ముందుకు సాగితే దేశ వృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని చెప్పారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త నినాదాన్ని అందించారు. సప్తధార శక్తి పేరుతో ఆయా రంగాలకు, వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు. ముఖ్యంగా యువతరానికి ఇచ్చే ప్రయార్టీని మోదీ పదే పదే హైలైట్ చేశారు. జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో వారి విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే తన సంకల్పాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పం, దేశ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ సంకల్పం ప్రపంచం భారతదేశాన్ని భిన్నంగా చూసేలా చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.ఈ రోజు భారత్ ఒక గొప్ప కలను కంటోంది. కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని పూర్తి సంకల్పంతో కలలు కంటోంది. ఆ కల ఏమిటంటే, 2047లో భారతదేశం తన స్వాతంత్ర్యానికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు, మనం కచ్చితంగా ‘అభివృద్ధి చెందిన భారత్‌ను ‘ నిర్మించి, దానిని సాకారం చేస్తాం.140 కోట్ల మంది పౌరుల కృషి, ప్రయత్నాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పించినప్పుడు, అది యావత్ ప్రపంచం ముందు భారత్ ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తుందని, భారత్‌పై ప్రపంచ దృక్పథాన్ని మార్చుకునేలా చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు.భారత్ కలలు, సంకల్పం గొప్పగా ఉండాలని, ఎందుకంటే గొప్ప లక్ష్యాలు దేశ సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చడంలో సహాయపడతాయని ప్రధాని మోదీ అన్నారు. “మన కలలు, సంకల్పం గొప్పగా ఉండాలి, ఎందుకంటే అవి మన సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చడంలో సహాయపడతాయి” అని ఆయన అన్నారు. 12 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులను, వివిధ రంగాల్లో పెరిగిన ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ దాదాపు ఏడు రెట్లు, ఆధునిక రైల్వే కోచ్‌ల ఉత్పత్తి 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగాయని తెలిపారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య, అలాగే పేటెంట్ల సంఖ్య కూడా దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి ప్రకారం, డిజిటల్ లావాదేవీలు దాదాపు 100 రెట్లు పెరిగాయి.25 కోట్ల మంది పౌరులు పేదరికాన్ని అధిగమించి దాని నుంచి బయటపడ్డారు. ఒకప్పుడు మనల్ని ‘ఫ్రాజైల్ 5’ (అతి బలహీనమైన ఐదు దేశాలు)లో ఒకటిగా పరిగణించేవారు. నేడు, మనం ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. 2014 నాటికి, ప్రపంచం మనల్ని ‘ఫ్రాజైల్ 5’ జాబితాలో బంధించింది. గత 12 సంవత్సరాలుగా, మనం వేగంగా పురోగమిస్తున్నాం.ఇరాన్-అమెరికా ఉద్రిక్తతను ప్రస్తావిస్తూ, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తాము సన్నాహాలు చేశామని, అవి ఫలించాయని అన్నారు. ఇంధన భద్రత ప్రస్తుత అవసరమని ప్రధాని మోదీ అన్నారు. “ఇంధనం లేకుండా ఈ నూతన ప్రపంచంలో ముందుకు సాగడం కష్టంగా మారింది. మనకు భారీ మొత్తంలో ఇంధనం అవసరం. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.”పెట్రోల్, డీజిల్, ఎరువులను ఆయుధాలుగా వాడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. చమురు, గ్యాస్ పేరిట ప్రజలను భయపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో మనం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. కరోనావైరస్ కారణంగా అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఉక్రెయిన్ నుంచి పశ్చిమ ఆసియా వరకు… ప్రతిచోటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. కానీ భారత్ సన్నాహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మనం మన బలాలపై నిలబడి ముందుకు సాగుతున్నాం. ఎర్రకోట ప్రాంగణం నుంచి ప్రధాని మోదీ, జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరాలకు ఒక ముఖ్యమైన కానుకను ప్రకటించారు. ఏడాదిలోగా కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తానని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ను కూడా ఆయన ప్రకటించారు. “అభివృద్ధి చెందిన దేశంగా భారత్ సాగించే ప్రయాణంలో యువత పోషించాల్సిన పాత్ర చాలా పెద్దది. ఈ రోజు, ఎర్రకోట ప్రాంగణం నుంచి నేను దేశ యువతకు ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరంలో 10 మిలియన్ల యువతకు ఏఐ నైపుణ్యాల శిక్షణను అందించాలని సంకల్పించాము, తద్వారా మన దేశ యువత ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు,” అని ఆయన అన్నారు. =
==================