ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 7:35 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

27 లక్షల మందికి ఏకకాలంలో అల్పాహారం.. ప్రపంచంలో ఎక్కడా లేదు ‎ ‎ తెలంగాణలోనే తొలిసారి.. విద్యార్థుల పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి ‎ ‎బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదు.. మళ్లీ వచ్చేది ఎందుకో చెప్పాలి ‎ ‎సంక్షేమం ఉచితం కాదు.. రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధికి పెట్టుబడి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అర్జున్ సమాచారం:
‎రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని, తెలంగాణలోనే ఈ వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం ఉచితం కాదని, అది రాష్ట్ర భవిష్యత్తు మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడని పేర్కొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకుంటేనే భవిష్యత్తులో రాష్ట్ర ఉత్పత్తికి పెద్ద ఎత్తున తోడ్పడతారని, తద్వారా జీఎస్‌డీపీ వృద్ధికి దోహదం చేస్తారని చెప్పారు.
‎
‎
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మునగాల గ్రామంలో పాఠశాలల విద్యార్థుల కోసం రూ.9.6 కోట్లతో నిర్మించనున్న సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. 1,020 పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 60 వేల మంది విద్యార్థులకు ఒకే కిచెన్‌ నుంచి పరిశుభ్రమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందించేందుకు మునగాలలో ఈ గ్రీన్‌ఫీల్డ్‌ కిచెన్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
‎
‎రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు వారానికి ఆరు రోజులపాటు అల్పాహారం అందిస్తున్నామని  తెలిపారు. మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ అందిస్తున్నామని చెప్పారు. ఇంటి వద్ద వంద మందికి వంట చేయడం కూడా కష్టమైన పరిస్థితుల్లో 27 లక్షల మంది విద్యార్థులకు ఏకకాలంలో అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది తెలంగాణ ప్రభుత్వ మానవీయ దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని అన్నారు. ఎదిగే వయసులో పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం అందిస్తేనే వారు ఆరోగ్యవంతమైన మానవ వనరుగా ఎదుగుతారని చెప్పారు. అందుకే పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు చిన్ననాటి నుంచే నాణ్యమైన ఆహారం అందిస్తూ, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని వివరించారు.
==========================