ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 8:07 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రిమాండ్ లో 60 మంది ప్రభుత్వ ఉద్యోగులు…

రిమాండ్ లో 60 మంది ప్రభుత్వ ఉద్యోగులు…

హైదరాబాద్, నవంబరు 18, (అర్జున్ సమాచారం ప్రతినిధి).

తెలంగాణలో అవినీతి కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం దాదాపు 60 మంది ప్రభుత్వ ఉద్యోగులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లు సమాచారం. చంచల్‌గూడ జైలులోనే సుమారు 35 మంది ఉండగా, 2025 అక్టోబర్ నుంచి 2026 జూన్ వరకు 107 మంది అధికారులు జైలుకు వెళ్లారు. మరోవైపు ప్రభుత్వ అనుమతి నిరాకరణతో 2023 నుంచి ఇప్పటివరకు 23 కేసులను ఏసీబీ మూసివేసింది. అవినీతి నిరోధక చర్యలు, కేసుల మూసివేత రెండూ చర్చనీయాంశంగా మారాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవినీతి ఆరోపణలతో జైళ్లలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాదాపు 60 మంది ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాల ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులోనే సుమారు 35 మంది ప్రభుత్వ సిబ్బంది ఉండగా.. వీరిలో ఎక్కువ మంది ఉన్నతాధికారులే ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారు ఖమ్మం, కరీంనగర్ జైళ్లలో ఉన్నారు. పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు అవినీతి కేసుల్లో అరెస్టవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడుల్లో పలువురు కీలక అధికారులు పట్టుబడ్డారు. నాగర్‌కర్నూల్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్. సత్యనారాయణ, రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి. రవీందర్, నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్, మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి, కీసర ఇన్‌స్పెక్టర్ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి తదితరులు ఏసీబీకి పట్టుబడిన వారిలో ఉన్నారు. ఉన్నత స్థాయి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటుండటంతో అవినీతి కేసుల్లో అరెస్టుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.2025 అక్టోబర్ నుంచి ఏసీబీ అవినీతి అధికారులపై చర్యలను ముమ్మరం చేయడంతో జైళ్లలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2025 అక్టోబర్ నుంచి 2026 జూన్ వరకు మొత్తం 107 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు జైలుకు వెళ్లినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 95 మంది ట్రాప్ కేసులకు సంబంధించినవారు. అంటే లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న వారే అధికంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసుల నమోదు చాలా తక్కువగా ఉండేదని, ట్రాప్ కేసుల్లోనూ కింది స్థాయి ఉద్యోగులే ఎక్కువగా పట్టుబడేవారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే 2024 తర్వాత ఏసీబీ పనితీరులో మార్పు వచ్చిందని 2025 నుంచి అవినీతి అధికారులపై దర్యాప్తులు, దాడులు మరింత విస్తృతమయ్యాయని చెబుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జైళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సంఖ్య ఇదే అత్యధికమని జైళ్ల శాఖ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.ఒకవైపు అవినీతి అధికారులపై ఏసీబీ అరెస్టులు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో పలు కేసులు మూసివేతకు గురవుతున్నాయి. 2023 నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన 20కి పైగా అవినీతి కేసులను ఏసీబీ మూసివేసింది. తాజాగా నవంబర్ మొదటి వారంలో మరో పోలీసు అధికారికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను మూసివేసేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ సంఖ్య 23కు చేరింది. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖలకు చెందిన అధికారులపై నమోదైన ట్రాప్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఈ జాబితాలో ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం కింద విచారణ అనంతరం అభియోగాలు నమోదు చేసేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతి లభించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.తాజాగా మూసివేసిన కేసు హైదరాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్‌ఐకి సంబంధించినది. 2023 జనవరి 13న ఫిర్యాదుదారుడి కుమారుడిపై నమోదైన మోసం కేసు నుంచి తప్పించడంతోపాటు, అతడి సెల్‌ఫోన్ తిరిగి ఇప్పించేందుకు రూ.8 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకున్న సమయంలో ఏసీబీ అధికారులు సదరు ఎస్‌ఐని పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు పూర్తిచేసిన అనంతరం 2023 సెప్టెంబర్ 21న అభియోగాలు నమోదు చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ ఏసీబీ నివేదిక పంపింది.అయితే ప్రభుత్వం ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించింది. 2026 జనవరి 27న జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 88 ద్వారా ఏసీబీ డైరెక్టర్ జనరల్ సిఫారసులతో విభేదించింది. ప్రాసిక్యూషన్‌కు అవసరమైన స్థాయిలో ఆధారాలు లేవని, కేసు విచారణకు తగినది కాదని పేర్కొంటూ క్రిమినల్ చర్యలకు బదులుగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం మార్చి 10న ఏసీబీ డీజీ దర్యాప్తు అధికారికి ఎఫ్‌ఐఆర్ మూసివేత కోసం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. సెప్టెంబర్ 11న కోర్టుకు హాజరైన ఫిర్యాదుదారుడు తుది నివేదికపై తనకు అభ్యంతరం లేదని తెలిపాడు. దీంతో నవంబర్ 2న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కేసు మూసివేతకు సంబంధించిన తుది నివేదికను అంగీకరించి విచారణను ముగించింది. ఇలా ఒకవైపు అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు, అరెస్టులు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రభుత్వ అనుమతుల కారణంగా కేసుల మూసివేత కూడా చర్చకు దారితీస్తోంది