ePaper
Monday, August 17, 2026
ePaper
Homeతెలంగాణరైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ కుమారు దీపక్.

రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ కుమారు దీపక్.

📰 Generate e-Paper Clip

రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ కుమారు దీపక్.

అర్జున్ సమాచారం ( ప్రతినిధి )మంచిర్యాల:ఆగస్టు 17, 2026:

రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి నీటిపారుదల శాఖ ఎస్.ఈ. విష్ణు ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం, భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు రానున్న రబీ సీజన్‌లోనూ నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని మొదటి ప్రాధాన్యతగా త్రాగునీటి అవసరాలకు వినియోగించాల్సిన పరిస్థితి ఉందని, గొల‍్లవాగు ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులలోనూ వరి సాగుకు అవసరమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలిపారు. వరి పంటకు ఒక ఎకరాకు అవసరమయ్యే నీటితో సమానమయ్యే నీటిని వినియోగించి సుమారు 3 నుంచి 4 ఎకరాలలో ఆరు తడి పంటలను సాగు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులు వరి నాట్లు వేస్తే పంటకు అవసరమైన నీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో పంట ఎండిపోయే ప్రమాదం, దిగుబడి తగ్గడం, ధాన్యం నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. నీటి కొరత కారణంగా వరి గింజ పరిమాణం తగ్గి, దిగుబడి తగ్గడంతో పాటు పంటను మార్కెట్‌లో విక్రయించడంలోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, అలసందులు వంటి తక్కువ నీటితో సాగు చేయగల పంటలను రైతులు ఎంచుకోవాలని, ఈ పంటలకు అవసరమైన మేరకు నీటిని అందించగలిగే అవకాశం ఉన్నందున పంటలు విజయవంతంగా సాగయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అవసరమైన విత్తనాలను కూడా అందించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు తదితర పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పిస్తోందని, మొక్కజొన్నకు బహిరంగ మార్కెట్‌లో గరిష్ట మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. నీటి లభ్యత, వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జూన్ 1వ తేదీ నుంచే రైతులకు పంటల ఎంపికపై అవగాహన కల్పిస్తున్నామని, అయినప్పటికీ కొంతమంది రైతులు వరి సాగు చేయాలని నిర్ణయిస్తే భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. భూగర్భ జలమట్టాలు తగ్గిన నేపథ్యంలో బోర్లపై ఆధారపడే రైతులు సైతం నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని, రైతులు పరిస్థితులను అంచనా వేసి నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత నీటి పరిస్థితులపై రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించి, పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించడంలో మీడియా సంస్థలు కూడా భాగస్వాములు కావాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో నీటి లభ్యత, వర్షపాతం విషయంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టడం అవసరమని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలంటే వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో వరి సాగు చేసి నీటి కొరతతో పంట నష్టపోయే కంటే మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, అలసందులు వంటి పంటలను సాగు చేయడం రైతులకు ప్రయోజనకరమని తెలిపారు. రైతులు నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసుకొని, వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ, సాగునీటి శాఖల అధికారుల సూచనలు పాటిస్తూ పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!