ప్రభుత్వానికి ఆదాయం.. ప్రజలకు అవస్థలు!మంథని తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మౌలిక వసతుల కొరత.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 17:
మంథని నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిస్థితి “పేరు గొప్ప.. ఊరు దిబ్బ” అన్న చందంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూ ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ కోసం వచ్చే రైతులు, మహిళలు, వృద్ధులు గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. తగిన వసతులు లేకుండానే తహసీల్దార్ కార్యాలయాన్ని హాస్టల్ భవనంలోకి మార్చి నిర్వహిస్తున్న అధికారులు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే ప్రజలకు కనీసం కూర్చునేందుకు కుర్చీలు, తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా కార్యాలయ బోర్డును చెట్ల మధ్య ఏర్పాటు చేయడంతో కార్యాలయాన్ని గుర్తించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేక గది, తగిన గాలి సౌకర్యం, రైతులు, మహిళలు, వృద్ధుల కోసం కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు మాత్రం తమ కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేసుకోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్యుల నియోజకవర్గమైన మంథనికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అనుకూలంగా, సౌకర్యవంతంగా ఉంటాయని ఆశించిన ప్రజలకు ప్రస్తుత పరిస్థితి నిరాశ కలిగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మంథని తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి, రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

