ePaper
Monday, September 7, 2026
ePaper
Homeతెలంగాణఇందిరమ్మ పాలనంటే మళ్లీ ఎమర్జెన్సీ రోజులను తలపించే చీకటి పాలనేవేయి రోజుల పాలనపై నిలదీస్తారనే భయంతో...

ఇందిరమ్మ పాలనంటే మళ్లీ ఎమర్జెన్సీ రోజులను తలపించే చీకటి పాలనేవేయి రోజుల పాలనపై నిలదీస్తారనే భయంతో ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారు: పుట్ట మధూకర్

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ పాలనంటే మళ్లీ ఎమర్జెన్సీ రోజులను తలపించే చీకటి పాలనే
వేయి రోజుల పాలనపై నిలదీస్తారనే భయంతో ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారు: పుట్ట మధూకర్

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, సెప్టెంబర్ 07:

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన అందిస్తామని చెప్పి, ప్రస్తుతం 1970ల ఎమర్జెన్సీ రోజులను తలపించేలా పాలన సాగిస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వేయి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో అసెంబ్లీకి వెళ్తుంటే అడ్డుకుని అరెస్ట్‌ చేయడం, మహిళా నాయకులు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ మంథని పాత పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని పెద్దపల్లి–కాటారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వేయి రోజుల పాలనపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే వారిని అడ్డుకున్నారని అన్నారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం సిగ్గుచేటని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

వేయి రోజుల పాలనలో వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడంపై దృష్టి పెట్టారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఇందిరమ్మ పాలన అంటే ఇంత దౌర్భాగ్యమైన పాలనా అని పెద్దలు అంటున్నారని, ఆనాటి ఎమర్జెన్సీ చీకటి రోజులను మళ్లీ చూస్తున్నామని సీనియర్లు చెబుతున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో, 420 హామీలను ఐదేళ్లలో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై కుట్రలు, డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

పోలీసులు, డబ్బు సంచులను ఉపయోగించుకుని తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థమైందని, ఇక వారి ఆటలు సాగవని అన్నారు. ఇతర ప్రభుత్వాలు కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రయత్నించాయని, కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఢిల్లీకి కప్పం కట్టేందుకు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

మంథని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రజలు భయపడుతున్నారని, సమాజం కోసం ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని పుట్ట మధూకర్‌ ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రానీయకుండా అడ్డుకున్నా గడపగడపకు, ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు.

రాబోయే రెండేళ్లలో ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తామని, ఇప్పటికైనా మంథని ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కళ్లు తెరిచి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పుట్ట మధూకర్‌ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!