RG-3లో కార్మికుల క్వార్టర్లకు కరెంట్ కట్‌పై ఆగ్రహంకార్మిక కుటుంబాలకు వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలి: ములుమూరి శ్రీనివాస్.
అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 18, రామగిరి డెస్క్:
సింగరేణి RG-3 పరిధిలోని సెంటినరీ కాలనీలో కార్మికుల క్వార్టర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై బీజేపీ పెద్దపల్లి జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు విషజ్వరాలు, మరోవైపు వాతావరణ మార్పులు, ఎండ తీవ్రతతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో క్వార్టర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ లేకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
కరెంట్ లేకపోవడం వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని శ్రీనివాస్ హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి RG-3 సెంటినరీ కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన అన్ని క్వార్టర్లకు వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

