ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్ముదిరాజ్‌లను గ్రూపు-ఏ లోకి మార్చడంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ముదిరాజ్‌లను గ్రూపు-ఏ లోకి మార్చడంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-ఏ గ్రూపులో చేర్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  ప్రకటించారు. నిరుపేదల కోసం జీవితాలను త్యాగం చేసిన పోరాటయోధులు పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలను ట్యాంక్ బండ్ పరిసరాల్లో ప్రతిష్టించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. పండుగ సాయన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సాయన్నపై రూపొందించిన పాటలను ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, ముదిరాజ్ కమ్యూనిటీని బీసీ-డీ నుంచి మరో గ్రూపులోకి మార్చే అంశంపై గతంలో సరైన లెక్కలు లేవన్న కారణంగా న్యాయస్థానాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించాయని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రాతిపదికగా భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ముదిరాజ్‌లను గ్రూపు-ఏ లోకి మార్చడంపై మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా అధ్యయనం చేస్తుందని తెలిపారు. ఈ ఉపసంఘం న్యాయనిపుణులు, అధికారులతో సంప్రదింపులు జరిపిన మీదట, మంత్రివర్గంలో చర్చించి ముదిరాజ్‌లకు న్యాయం జరిగేలా సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

✅ ప్రభుత్వం నిర్వహించిన కులగణనతో ఇప్పుడు బీసీల లెక్కలు (SEEEPC) పక్కాగా ఉన్నాయని, పక్కా ప్రణాళికతో సముచిత నిర్ణయం తీసుకుంటామన్నారు. ముదిరాజ్‌లను బీసీ-ఏ గ్రూపులో చేర్చడం ద్వారా గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందన్న అనుమానాలు, అపోహలు ఉన్నాయని, అన్ని వివరాలపై ఆ వర్గాలతో చర్చించి వారిలోని అపోహలను దూరం చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కి సూచించారు.
స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయని పని, జనగణనలో కులగణన చేసి చూపించాం. 2024 ఫిబ్రవరి 4న కమిషన్ ఏర్పాటు చేసి సరిగ్గా ఏడాదికి 2025 ఫిబ్రవరి 4 నాటికి కులగణన లెక్కలు చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం
ఆ కులగణన లెక్కలే బలహీనవర్గాలకు ధైర్యాన్నిచ్చాయి. అడిగే హక్కును కల్పించింది. ప్రతి ఇంటి తలుపుతట్టి సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. లెక్కల్లో తేడాలు ఉన్నాయని భావిస్తే, ఏదైనా కారణంతో ఎవరి వివరాలైనా నమోదు కాకపోతే, వారి వివరాలను నమోదు చేయించండి
ఒకటి అరా ఎక్కడైనా తప్పిపోతే లెక్కలను సవరించుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంది. పక్కాగా లెక్కగట్టి సామాజిక న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఆశయం. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పక్కా న్యాయం జరగాలన్నదే లక్ష్యం. అని ముఖ్యమంత్రి  వివరించారు.

ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం చాలామంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని, 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించిందని గుర్తుచేశారు. దేశంలోనే ఎస్సీ కులాల వర్గీకరణ చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని చెప్పారు.
ఇలా జటిలమైన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు. ఆలస్యమైనా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది. ఈ జాతి సమస్యలపై సంపూర్ణ అవగాహన నాకుంది.

నిరుపేదలు, బహుజనులకు అండగా వారి భూములను రక్షించాలని, జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా పౌరుషంతో నేలకొరిగినా ఫరవాలేదని సర్వం ఒడ్డి పండుగ సాయన్న పోరాటం చేశారని కొనియాడారు. నిరుపేదలు పండుగ సాయన్న పేరును జానపదాల రూపంలో పల్లెల్లో ఇప్పటికీ స్మరిస్తారని చెప్పారు.

ఆ గొప్ప పోరాటయోధుడు పాలమూరు బిడ్డ అయినందుకు నాకెంతో గర్వకారణంగా ఉందన్నారు. జాతి మొత్తం తలెత్తుకునే విధంగా చరిత్ర పుటల్లో పండుగ సాయన్నకు ఒక పేజీ ఉండాలి. సమాజానికి ఉపయోగపడేది ఏదైనా తక్షణ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు గురించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తూ.. గత పాలకులు అమలు చేసిన సంక్షేమ పథకాలు వేటినీ రద్దు చేయకపోగా వాటిని మరింత మెరుగ్గా రెండింతలు చేసి అమలు చేస్తున్నామని వివరించారు
గతంలో 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత కరెంటిస్తే, ఇప్పుడు 200 యూనిట్ల లోపు వినియోగదారులు 55 లక్షల కుటుంబాలకు ఉచితంగా గృహవిద్యుత్ ఇస్తున్నాం.
రూ. 2 లక్షలున్న రాజీవ్ ఆరోగ్యశ్రీని పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాం. రైతు భరోసా రూ. 10 వేలు ఉంటే రూ. 12 వేలకు పెంచి ఇస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 14 వేల కోట్లకు పైగా వెచ్చించింది.
25 లక్షలకు పైగా రైతులకు రూ. 2 లక్షల మేరకు రుణమాఫీ చేశాం. నిరుపేదలకు 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి ఏ పథకం ఆపలేదు. మంచి పని ఎవరు చేసినా వాటిని మరింత మెరుగ్గా చేసి అమలు చేశామే తప్ప ఏ ఒక్కటీ ఆపలేదు అని స్పష్టం చేశారు.
సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, జ్యోతీరావు పూలే, చాకలి ఐలమ్మ ఎంతో మంది బహుజనుల కోసం పోరాడిన యోధులని గుర్తుచేశారు. కొందరు పోరాటయోధుల చరిత్రను కనుమరుగు చేశారు. జాతి కోసం జీవితాంతం తపించి, సర్వం త్యాగం చేసిన వారికి చరిత్రలో స్థానం లేకపోతే, ఈ నేల ఉన్నా లేకపోయినా ఒకటే అని వ్యాఖ్యానించారు.

సర్వాయి పాపన్న గౌడ్, జ్యోతీరావు పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేసినట్టుగానే ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న ప్రాంతంలో దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తాం అని ముఖ్యమంత్రి  ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , వాకిటి శ్రీహరి , శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , ఈటల రాజేందర్, సలహాదారు వీ హనుమంతరావు , ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!