శ్రీశైలం,అర్జున్ సమాచారం:
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ రోజు (13.07.2026) శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించబడింది.
కాగా ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి.
అనంతరం స్వర్ణరథోత్సవం జరిపించబడింది.
ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయి.
అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది.
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు, మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ కార్యక్రమములో చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏ.వి. రమణ, ఆలా అనిల్ కుమార్ ఆలయ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి కె. వేంకటేశ్వరా రావు, అర్చకస్వాములు, పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
====================

