సింగరేణి OCP-2లో ,అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి.
అధికారులు–కాంట్రాక్టర్ల కుమ్మక్కుతో సంస్థ సంపదకు నష్టం జరుగుతోందని ఆరోపణలు,
స్పేర్ పార్ట్స్ కొనుగోళ్లు, డిపో సామాగ్రి, ఆయిల్ వినియోగం, యంత్రాల నిర్వహణపై విజిలెన్స్ ఆడిట్ చేపట్టాలి: బీజేపీ నాయకుడు మొలుమూరి శ్రీనివాస్.
రామగిరి (మండలం) అర్జున్ సమాచారం, డెస్క్ నవంబర్ 16.
సింగరేణి RG-3 ఏరియాలోని OCP-2లో స్పేర్ పార్ట్స్ కొనుగోళ్లు, కాప్స్, డిపో సామాగ్రి సరఫరా తదితర వ్యవహారాల్లో కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై సంస్థ సంపదను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీటీసీల ఫోరం పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంస్థలో జరుగుతున్నట్లు ప్రచారంలో ఉన్న అక్రమాలు, అవకతవకలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు.
కాస్ట్ యాప్ పేరుతో కొనుగోలు చేసిన సామాగ్రిని తిరిగి కంపెనీలకు పంపించి, మళ్లీ కొత్త ఆర్డర్ల పేరుతో తెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. డిపో సామాగ్రి సరఫరాలోనూ ఇదే తరహా వ్యవహారాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. షావల్ సెక్షన్‌లో 50 టూత్‌లు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 20 మాత్రమే అందించారని, మిగిలిన వాటి విషయంలో పాత సామాగ్రిని కలిపి లెక్కలు సరిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అలాగే 100 క్వింటాళ్ల వెల్డింగ్ రాడ్ల వ్యవహారం, వారం రోజుల క్రితం వాహనంలో, నట్లు, బోల్టులు తరలించిన ఘటనపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు నాసిరకం కాయిల్స్‌ను తెప్పిస్తూ, పాత సామాగ్రినే తిరిగి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన ఆయిల్, ఇతర లూబ్రికెంట్లను కొనుగోలు చేస్తున్నప్పటికీ యంత్రాల్లో ఆయిల్ లీకేజీలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఆయిల్ లీకేజీల కారణంగా హౌస్ పైపులు వేడికి పగిలిపోతున్నాయని, ప్రతిరోజూ డ్రమ్ముల కొద్దీ ఆయిల్ వృథా అవుతూ సంస్థకు ఆర్థిక నష్టం కలుగుతోందని ఆరోపించారు. ఆయిల్ మార్పులు, వినియోగం, కొనుగోళ్ల వివరాలను పరిశీలించి వృథాకు గల కారణాలను గుర్తించాలని కోరారు.
అవసరమైన స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ యంత్రాలకు సకాలంలో మరమ్మతులు చేయకుండా బ్రేక్‌డౌన్‌ల పేరుతో నిలిపివేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. యంత్రాలు తరచూ ఎందుకు మొరాయిస్తున్నాయి? మరమ్మతుల్లో జాప్యానికి కారణాలేమిటి? నిర్వహణలో నిర్లక్ష్యమా లేక ఇతర కారణాలున్నాయా? అనే అంశాలను ఉన్నతాధికారులు పరిశీలించాలని కోరారు.