మాటలు నమ్మరని కాగితాలతో దగా చేసిన ప్రభుత్వంహామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న సర్కార్.
అన్నం పెట్టిన వారిపైనే కేసులు పెట్టించిన ఘనుడు దుద్దిళ్ల
పథకాలు ఆపి దోపిడీ చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారు
కేసీఆర్ వస్తేనే సబ్బండ వర్గాలకు మేలు
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 3 | ముత్తారం రిపోర్టర్
ప్రజలు మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితిలో లేరని, కాగితాలపై హామీలు రాసి ప్రజలను దగా చేసిన ఘనత మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌కే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు.
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ముత్తారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల విఫల పాలనలో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రైతులతో కలిసి ఎడ్లబండ్ల ర్యాలీ చేపట్టి ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. అధికారం కోసం అనేక మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ మేనిఫెస్టోలో అనేక అంశాలను పొందుపరిచి, ఒక్క పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మంథని ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు గడిచినా తాను రాసిన మేనిఫెస్టోలో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం పత్రికా ప్రకటనలకు కేటాయించే నిధులను ప్రజల సంక్షేమానికి వినియోగిస్తే పింఛన్లు పెంచవచ్చని, ఆ నిధులతో పేద కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూర్చవచ్చని అన్నారు.
ప్రజల సొమ్మును దోపిడీ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారని పుట్ట మధూకర్ ఆరోపించారు. రైతులు, ప్రజలను చైతన్యవంతులను చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రజల సంక్షేమానికి కేటాయించేలా బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.
దుద్దిళ్ల శ్రీధర్ రాసిన మేనిఫెస్టో, ప్రకటించిన హామీలనే తాము ప్రశ్నిస్తున్నామని, వాటిపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ నాయకులకు ఓర్వలేకపోయిందని విమర్శించారు.
రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ భరోసా అమలు చేస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఒక్కటి కాదు.. రెండు కాదు.. అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
భూభారతి పేరుతో 22-ఏలో భూములను చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యంలో రైతు సంక్షేమం? అని ప్రశ్నించారు.
మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌కు ఈ ప్రాంత ప్రజలతో ఓటు సంబంధం తప్ప పేగు సంబంధం లేదని తాను పదేపదే చెబుతున్నానని అన్నారు. తనపై రౌడీషీట్ ఓపెన్ చేయించారని, ప్రజలకు అన్నం పెట్టిన వారిపైనే అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర దుద్దిళ్లదేనని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురైన రైతులకు నష్టం జరగకుండా రెట్టింపు పరిహారం అందిస్తామని, కరకట్టలు నిర్మిస్తామని ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో దుద్దిళ్ల శ్రీధర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి సాధించాలంటే రైతు అభివృద్ధి చెందాలని, రైతు సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, ఎరువుల సరఫరా వంటి పథకాలను అమలు చేసిందని పుట్ట మధూకర్ పేర్కొన్నారు.
రైతులు చైతన్యవంతులై కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అప్పులు ఉన్నాయని, సంపద సృష్టిస్తామని, పథకాలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రజాపాలనపై అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని అన్నారు. రాబోయే కాలం బీఆర్‌ఎస్ పార్టీదేనని పేర్కొంటూ, ప్రజల పక్షాన పోరాటం చేసే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని అన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
నిరసన కార్యక్రమం అనంతరం ముత్తారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ, లక్కారం గ్రామ సర్పంచ్ అత్తే చంద్రమౌళి, మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య, మాజీ వైస్ ఎంపీపీ, ముత్తారం సర్పంచ్ సుధాటి రవీందర్‌రావు, మాజీ మండల అధ్యక్షుడు నూనె కుమార్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, మాజీ మండల యువజన అధ్యక్షుడు ఏల్పుల కుమార్ యాదవ్, నాయకులు నాంసాని సమ్మయ్య, చల్ల సమ్మయ్య, కూరాకుల ఓదేలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.