అక్రమంగా సరిహద్దు దాటిమస్కట్ నుంచి ,దుబాయి జైల్లో మగ్గుతున్న జగిత్యాల జిల్లా వాసి.
జగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం సెప్టెంబర్ 23::
◉ లాయర్ ను నియమించి, స్వదేశానికి రప్పించాలని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన కుటుంబం.
జగిత్యాల జిల్లా బీమారం మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన ఏగుర్ల మల్లేశం గత ఆరు నెలలుగా దుబాయి జైలులో ఉన్నారు. మార్చి 8న దుబాయిలో జరిగిన తనిఖీల సందర్భంగా అక్కడి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఎనిమిది ఏళ్ల క్రితం… 2018లో ఉపాధి కోసం ఓమాన్‌లోని మస్కట్‌కు వెళ్లిన మల్లేశం, కొందరి తప్పుడు సలహాలతో ఓమాన్–యూఏఈ ఎడారి సరిహద్దును భూమార్గంలో దాటి, దుబాయిలోకి అక్రమంగా ప్రవేశించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దుబాయిలోని భారత కాన్సులేట్ ద్వారా న్యాయవాదిని నియమించి, మల్లేశానికి న్యాయ సహాయం అందించడంతో పాటు, జైలు నుంచి విడుదల చేసి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన భార్య లత మంగళవారం (22.09.2026) హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు.
ఇదే విషయంపై గతంలో మే 1న కూడా దరఖాస్తు చేసుకున్నానని, అయితే ‘మదద్’ పోర్టల్‌లో నమోదైన తన ఫిర్యాదును భారత ప్రభుత్వం/భారత రాయబార కార్యాలయం తరఫున మూసివేశారని ఆమె వాపోయారు.
మల్లేశం భార్య లత, తల్లి బచ్చవ్వలను రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి గద్వాల విజయలక్ష్మి పరామర్శించి, తగిన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ రెడ్డి, ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్లు మహ్మద్ బషీర్ అహ్మద్, కర్రి పద్మారాణి, మోత్కురావుపేట సర్పంచ్ ఎనుగుల లచ్చయ్య, గ్రామ ప్రముఖుడు బూమల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.