ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 6:23 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

శ్రావణ ఆదివారం.. మల్లన్న గుట్టపై భక్తుల సందడి

శ్రావణ ఆదివారం.. మల్లన్న గుట్టపై భక్తుల సందడి

అర్జున్ సమాచారం. ఆగస్టు 29. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా:

శ్రావణ మాసం చివరి ఆదివారం పురస్కరించుకుని జైపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేలాల మల్లన్న గుట్ట భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచే మంచిర్యాల జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు గుట్టకు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది.

భక్తులు తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించి మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అర్చనలు చేశారు. శివసత్తుల పూనకాలు, ఒగ్గు డోలు చప్పట్లు, భక్తుల బోనాలతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

సెలవు రోజు కావడం, శ్రావణ ఆదివారం కావడంతో దర్శనానికి గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, స్థానిక అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.