ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 5:58 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆరు నెలలుగా దుబాయి పోలీసుల నిర్బంధంలో తెలంగాణ యువకుడు క్రెడిట్ కార్డు లావాదేవీల కేసులో చిక్కుకున్న విఘ్నేష్‌.. కుమారుడిని విడిపించి స్వదేశానికి రప్పించాలని తల్లి వేడుకోలు,..

ఆరు నెలలుగా దుబాయి పోలీసుల నిర్బంధంలో తెలంగాణ యువకుడు క్రెడిట్ కార్డు లావాదేవీల కేసులో చిక్కుకున్న విఘ్నేష్‌.. కుమారుడిని విడిపించి స్వదేశానికి రప్పించాలని తల్లి వేడుకోలు,..

జగిత్యాల జిల్లా ప్రతినిధి :అర్జున్ సమాచారం నవంబర్ 27 :

ఉపాధి కోసం దుబాయికి వెళ్లిన తెలంగాణ యువకుడు క్రెడిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన కేసులో చిక్కుకుని గత ఆరు నెలలుగా అక్కడి పోలీసుల నిర్బంధంలో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తన కుమారుడిని కేసు నుంచి విముక్తి కల్పించి, క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ తల్లి సాయిలక్ష్మి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్‌పల్లి గ్రామానికి చెందిన బెల్దారి విఘ్నేష్ ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. అయితే, క్రెడిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన కేసులో అతడు పోలీసుల అదుపులోకి వెళ్లడంతో కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. సుమారు రూ.4 లక్షల విలువైన లావాదేవీల వ్యవహారంలో తన కుమారుడు నిందితుడిగా మారడం వెనుక అసలు కారణాలను పరిశీలించి న్యాయం చేయాలని తల్లి కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో సాయిలక్ష్మి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఉద్దేశించి తన విజ్ఞప్తిని అందజేశారు. తన కుమారుడి విడుదలకు, స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా సీఎం ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిని కలిసి విఘ్నేష్ పరిస్థితిని వివరించారు. దుబాయిలో తన కుమారుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కుటుంబ సభ్యుల ఆందోళనను వారి దృష్టికి తీసుకెళ్లి సహాయం కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రవాసీ ప్రజావాణి వాలంటీర్లు కర్రి పద్మారాణి, గంగుల మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్రెడిట్ కార్డు లావాదేవీలకు సంబంధించి 15,727 యూఏఈ దిర్హామ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.4 లక్షలు) అనధికారికంగా వినియోగించినట్లు ఆరోపణలు రావడంతో దుబాయిలోని మురక్కబాత్ పోలీస్ స్టేషన్‌లో ఏప్రిల్ 24న కేసు నమోదైంది. విఘ్నేష్ పేరు మీద రిజిస్టర్ అయిన మొబైల్ సిమ్ కార్డుతో సంబంధం ఉన్న క్రెడిట్ కార్డు ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు కేసులో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీసులు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.

అయితే, తన కుమారుడికి తెలియకుండా అతని పేరు మీద ఉన్న మొబైల్ సిమ్ కార్డు, క్రెడిట్ కార్డులను ఇతర వ్యక్తులు దుర్వినియోగం చేసి ఉండవచ్చని సాయిలక్ష్మి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు లావాదేవీలు ఎవరు నిర్వహించారు? వాటితో తన కుమారుడికి ఉన్న సంబంధం ఏమిటి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలని కోరుతున్నారు.

తన కుమారుడు విదేశీ జైలులో ఆరు నెలలుగా ఉండటంతో కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి దుబాయిలోని భారత కాన్సులేట్ ద్వారా తగిన దౌత్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన న్యాయ సహాయం కల్పించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించాలని కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చర్యలు తీసుకుని, విఘ్నేష్‌కు న్యాయం జరిగేలా చూడటంతో పాటు వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి సహకరించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన యువకులు అనుకోని న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకున్నప్పుడు వారి కుటుంబాలకు ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది. విఘ్నేష్ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపడుతుందా అనే ఆశతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.