ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 2:06 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మంథని ఆనవాళ్లను చెరిపే ప్రయత్నం: పుట్ట మధూకర్‌ .మార్కెట్‌ పనులు ప్రారంభించడంలో ఎందుకు జాప్యం? అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలి.

మంథని ఆనవాళ్లను చెరిపే ప్రయత్నం: పుట్ట మధూకర్‌ .మార్కెట్‌ పనులు ప్రారంభించడంలో ఎందుకు జాప్యం? అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలి.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // మంథని. డెస్క్.

మంథనిలోని చారిత్రక ఆనవాళ్లను చెరిపివేయడమే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆలోచనగా కనిపిస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. శనివారం మంథనిలో నూతనంగా నిర్మించనున్న వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈతో ఫోన్‌లో మాట్లాడి మార్కెట్‌ నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం మార్కెట్‌ నిర్మాణం కోసం పాత మార్కెట్‌ను డిస్మాంటిల్‌ చేసినప్పటికీ ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తొలగించలేదని విమర్శించారు. మార్కెట్‌ డిజైన్‌ పనులకే నాలుగు నెలలు సమయం పడితే, నిర్మాణం పూర్తవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో అధికారులు, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మంథని చరిత్రతో ముడిపడి ఉన్న మార్కెట్‌ను తొలగించి దాని ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి నిర్మాణానికి తన తండ్రి పేరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మార్కెట్‌ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం వెనుక కారణాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని కోరారు.

వచ్చే ఏడాది పుష్కరాల నాటికి మార్కెట్‌ పూర్తికాకపోతే చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. మార్కెట్‌ నిర్మాణం పేరుతో వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. కాటారం మార్కెట్‌లోనూ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

మంథని ప్రాంత ప్రజల భవిష్యత్తు, తాగునీరు, విద్యుత్‌, ఉపాధి అంశాలపై పాలకులు దృష్టి సారించాలని అన్నారు. మున్సిపల్‌ భవనం, ఆసుపత్రి వంటి ప్రస్తుత సదుపాయాలను మెరుగుపరచకుండా కొత్త నిర్మాణాల పేరుతో పనులు చేపట్టడం వల్ల ప్రజలకు ఎంత ప్రయోజనం కలుగుతుందో ప్రశ్నించారు.

తనకు చిన్నప్పటి నుంచే ఈ మార్కెట్‌తో అనుబంధం ఉందని, తన తండ్రి ఇక్కడ గొడ్ల అంగడి నిర్వహించేవారని తెలిపారు. అందుకే మార్కెట్‌ పరిస్థితిపై స్పందిస్తున్నానన్నారు. ప్రజలు, చిరు వ్యాపారుల సమస్యలపై తాను తుది శ్వాస వరకు పోరాడుతానని చెప్పారు.

మార్కెట్‌ నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభం కాలేదో మంథని ఎమ్మెల్యే, అధికార యంత్రాంగం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని పుట్ట మధూకర్‌ డిమాండ్‌ చేశారు.