ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 8:31 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎస్టేట్ అధికారి ఐలయ్యపై విచారణ చేపట్టాలి.అధికార పార్టీ నాయకుడి అండతో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు

ఎస్టేట్ అధికారి ఐలయ్యపై విచారణ చేపట్టాలి.అధికార పార్టీ నాయకుడి అండతో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు

ఆధారాలను జీఎం, విజిలెన్స్, డైరెక్టర్ పీఏ, సీఎండీకి పంపిస్తున్నాం: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శెంకేషి రవీందర్

అర్జున్ సమాచారం//అక్టోబర్ 8//రామగిరి రిపోర్టర్.

రామగిరి: సింగరేణి ఆర్జీ-3 పరిధిలో సంస్థ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం, అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్టేట్ అధికారి ఐలయ్యపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శెంకేషి రవీందర్ డిమాండ్ చేశారు.

గురువారం సెంటినరీ కాలనీలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక అధికార పార్టీ నాయకుడి అండతో ఎస్టేట్ అధికారి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సంస్థ భూములు ఆక్రమణలకు గురవుతున్న సమయంలో వాటిని కాపాడాల్సిన అధికారి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పాత పీనల్ రెంట్ రసీదులను ఆధారంగా చేసుకుని కొత్తగా నిర్మాణాలు, టేలాలు వేయిస్తున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రవీందర్ తెలిపారు. ఆరోపణలపై సమాధానం ఇవ్వాల్సిన అధికారి తమ నాయకుడి పేరును ప్రస్తావించడం ద్వారా అధికార పార్టీతో ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

తమ వద్ద ఉన్న ఆధారాలను సింగరేణి జీఎం, విజిలెన్స్ విభాగంతో పాటు డైరెక్టర్ పీఏ, సీఎండీకి ఈ-మెయిల్ ద్వారా పంపిస్తున్నామని తెలిపారు. తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఐలయ్య ఎస్టేట్ అధికారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్జీ-3 పరిధిలో ఎన్ని కొత్త నిర్మాణాలు జరిగాయి, ఎన్ని టేలాలు వేశారు, వకీల్‌పల్లి చర్చి సమీపంలోని భూమి ఆక్రమణకు బాధ్యులెవరు అనే అంశాలపై విచారణ జరపాలని కోరారు. అలాగే పాత పీనల్ రెంట్ రసీదులను ఎవరికి బదలాయించారు అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలించాలని డిమాండ్ చేశారు.

ఎస్టేట్ అధికారి వ్యవహారంపై జీఎం మధుసూదన్ సమగ్రంగా పరిశీలించి సంస్థ ఆస్తుల పరిరక్షణలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై బాధ్యత వహించాలని రవీందర్ కోరారు. సమస్యపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీ పెగడ శ్రీనివాస్, నాయకులు దామెర శ్రీనివాస్, బొంకూరి పోశం, కృష్ణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.