ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 4:02 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

7 నుంచి అసెంబ్లీ

7 నుంచి అసెంబ్లీ

హైదరాబాద్, ఆగస్టు 25 (అర్జున్ సమాచారం ప్రతినిధి హైద్రాబాద్ ఆగస్టు 25)

: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల సమయంలో ఈ సమావేశాలు నిర్వహించనుండటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తొలి రోజు సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీలో ఉభయ సభలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై  నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాలను సభ ముందు ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు, ప్రజా సమస్యలు, హామీల అమలు, భూముల వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న రిజిస్ట్రేషన్ల చట్టంలోని వివాదాస్పద 22 ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ జరుగుతుందా అని ఆసక్తి నెలకొంది. రైతులకు ప్రాజెక్టుల నుంచి సాగునీటిని సకాలంలో విడుదల చేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసినవి ఆరోపణలేనని నిలదీసేందుకు కేటీఆర్, హరీష్ రావు టీం ప్లాన్ చేయనుంది. రాష్ట్రంలో  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, పాలిటెక్నిక్ కాలేజీల సమస్యలు, సభలో నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విదేశాలకు వెళ్లగా యూకే పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అమెరికా పర్యటనకు మాత్రం కొర్రీలు పెట్టడాన్ని తప్పుపట్టారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..  విద్య, క్రీడా రంగాలకు సంబంధించి పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం ఆకర్షించడమే లక్ష్యంగా విదేశీ పర్యటన కోసం విదేశాంగ శాఖకు ముందే పూర్తి వివరాలు సమర్పించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తూ అమెరికా పర్యటనకు మాత్రం నిరాకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎంకు విదేశీ పర్యటనలు, రోడ్ షోలకు సులభంగా అనుమతులు ఇచ్చి, తెలంగాణ సీఎం పర్యటనను అడ్డుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. “కేంద్రం భౌతికంగా నన్ను అడ్డుకోగలదు, కానీ నా ఆలోచనలను, తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షలను కాదనలేదు” అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగత అవమానం కాదని, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయమని పేర్కొన్నారు. కేంద్ర వైఖరిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు.రైజింగ్ తెలంగాణ 2047 ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకుంటే, కేంద్రంలోని బీజేపీ నేతలు విచక్షణ మరిచిపోయి ఈ అధికారిక పర్యటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, రెండు ప్రభుత్వాలు మరియు ప్రజాప్రతినిధుల మధ్య ఫెడరల్ సత్సంబంధాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.