ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 1:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ.

లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ.

అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తుల పోటెత్తు.

శ్రీచక్ర అధిష్ఠాన దేవతగా లలితాదేవికి విశేష పూజలు.. మోక్షప్రదాయినిగా అమ్మవారి ఆరాధన,

విజయవాడ, అక్టోబర్ 15 (అర్జున్ సమాచారం):

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన గురువారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ దివ్యరూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచే క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు.

శ్రీచక్ర అధిష్ఠాన దేవతగా లలితాదేవి ఆరాధన

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని శ్రీచక్ర అధిష్ఠాన దేవతగా, పంచదశాక్షరీ మంత్రానికి అధిదేవతగా భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. ప్రకృతి శక్తికి ప్రతిరూపంగా భావించే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల సంపదలు, సౌభాగ్యాలు కలుగుతాయని, ఆధ్యాత్మిక ఉన్నతి, మోక్షప్రాప్తి సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రుల్లో ఈ అలంకారానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండటంతో అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

చెరుకుగడ చేతబూని దివ్య అలంకారంలో అమ్మవారు

చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరుకుగడను ధరించి, పరమశివుని అంకపీఠంపై ఆసీనురాలైన అమ్మవారి రూపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి ఇరువైపులా లక్ష్మీదేవి, సరస్వతీదేవి వింజామరలు వీస్తున్నట్లుగా అలంకరణ చేశారు. ఈ దివ్య అలంకారంలో కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఉదయం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చేపట్టిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంసించారు.

శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి కొనసాగుతోంది. అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.