పుట్టిన చిన్నారులకు తల్లిపాలే శ్రేష్ఠం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించిన పెంచికల్‌పేట గ్రామ పంచాయతీ
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 03
కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను గ్రామ సర్పంచ్ పల్లె మాధవి-నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పుట్టిన చిన్నారులకు తల్లిపాలే శ్రేష్ఠమైన ఆహారమని తెలిపారు. శిశువులకు పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం, మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని పేర్కొన్నారు. తల్లిపాలు శిశువులకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని వివరించారు.
అంగన్‌వాడీ సిబ్బంది గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, సరైన పోషకాహారం, తల్లి–శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లులు తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుని ప్రతి శిశువుకు తల్లిపాలు అందించాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు కౌసల్య, ఈశ్వరి, ఏఎన్‌ఎం మేటిల్డ, ఆశా కార్యకర్తలు కల్యాణి, సుమలత, గ్రామ మహిళలు, గర్భిణీలు, బాలింతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
.