ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 5:43 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రకృతి మిత్రులుగా మారితే ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు,ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత….నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి.

ప్రకృతి మిత్రులుగా మారితే ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు,
ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత….నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి.

ప్రకృతిమిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు, ప్రభుత్వ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్,

కరీంనగర్:అర్జున్ సమాచారం .నవంబర్ 14 .కరీంనగర్ రిపోర్టర్

కరీంనగర్: ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రకృతిమిత్రులుగా మారితే ఎల్‌నినో వంటి వాతావరణ విపత్తుల ప్రభావాన్ని నుండి ఎదుర్కొనేందుకు ఎంతోకొంత దోహదపడవచ్చని ప్రకృతిమిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ వాల్టా అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం, నీటి వనరులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.

కరీంనగర్‌లోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల డిగ్రీ, పీజీ కళాశాల బాలికల వసతి గృహంలో జిల్లా అధ్యక్షుడు కొత్తూరి ముకుందం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థినులకు ‘ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న ఎల్‌నినో వాతావరణ మార్పులు.. కారణాలు.. మానవ బాధ్యత’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుండేటి యోగేశ్వర్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మానవ తప్పిదాలు, ప్రకృతి వనరుల విధ్వంసం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమధ్యరేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే అసాధారణ మార్పులు ఎల్‌నినో పరిస్థితులకు దారితీస్తాయని వివరించారు. ఇటువంటి వాతావరణ మార్పులు వ్యవసాయం, వర్షపాతం, నీటి లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

ఇకనైనా ప్రకృతికి హాని కలిగించే చర్యలను విడనాడాలని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(g) ప్రకారం ప్రకృతి, అడవులు, నదులు, వన్యప్రాణులను పరిరక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు. విద్యార్థులు మొదలుకొని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా అవి పెద్ద వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ సందర్భంగా ఎల్‌నినోపై అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కరీంనగర్ జిల్లా ప్రకృతిమిత్ర సభ్యులతో కలిసి విద్యార్థినులు, ఇతరులకు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. జీవరక్షక ట్రస్టు సహకారంతో పర్యావరణ మిత్ర సంచులను విద్యార్థినులకు ఉచితంగా పంపిణీ చేశారు.