క్యూవీఎస్ఈ ఫేక్ యాప్లో పెట్టుబడుల పేరుతో రూ.13.25 లక్షల మోసంకేసు నమోదు
అధిక లాభాల ఆశ చూపే ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి:ఇన్స్పెక్టర్ కమలాకర్.
జడ్చర్ల: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 19.
జడ్చర్ల పట్టణానికి చెందిన పలువురు వ్యక్తులు “క్యూవీఎస్ఈ” అనే యాప్లో పెట్టుబడులు పెడితే డాలర్ల రూపంలో అధిక లాభాలు వస్తాయని నమ్మి మొత్తం సుమారు రూ.13.25 లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జడ్చర్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కమలాకర్ తెలిపారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి క్యూవీఎస్ఈ యాప్లో తాను పెట్టుబడి పెట్టి లాభాలు పొందుతున్నట్లు చూపిస్తూ పలువురిని నమ్మించినట్లు తెలిపారు. అతను పంపిన లింక్ ద్వారా బాధితులు యాప్ను ఇన్స్టాల్ చేసుకుని మొదట కొంత మొత్తాన్ని ఫోన్పే ద్వారా చెల్లించారు. అనంతరం యాప్లో తమ పెట్టుబడి డాలర్ల రూపంలో పెరుగుతున్నట్లు కనిపించడంతో దానిని నిజమైన లాభంగా భావించి మరింత డబ్బును పెట్టుబడిగా పెట్టారు.
ఈ క్రమంలో సొంత డబ్బులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తుల నుంచి సేకరించిన మొత్తాలను ఫోన్పే, నగదు రూపంలో చెల్లించి మొత్తం రూ.13,25,000/- వరకు పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే యాప్లో డబ్బు పెరుగుతున్నట్లు కనిపించినప్పటికీ, ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తిని సంప్రదించగా మరికొంత సమయం వేచి ఉండాలని చెప్పినట్లు తెలిపారు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు 18-09-2026న జడ్చర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కమలాకర్ తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కమలాకర్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో అధిక లాభాలు, డాలర్ల రూపంలో భారీ రాబడులు వస్తాయని చెప్పే ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్లు, ఆన్లైన్ స్కీమ్లను నమ్మవద్దని సూచించారు. యాప్లో పెట్టుబడి మొత్తం లేదా లాభం పెరుగుతున్నట్లు కనిపించడం మాత్రమే అది నిజమైన పెట్టుబడి అని నిర్ధారించడానికి ఆధారం కాదని తెలిపారు.
పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ, యాప్ చట్టబద్ధత, విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని, అనుమానాస్పద యాప్లను ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. , బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్లు ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు.