ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 2:52 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలి.. .మట్టి దీపాలే ముద్దు, టపాసులు వద్దు,మట్టి ప్రమిదలతో ప్రదర్శన… ..కాలుష్య నివారణపై ప్రజలకు అవగాహన, పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ.

కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలి.. .మట్టి దీపాలే ముద్దు, టపాసులు వద్దు,
మట్టి ప్రమిదలతో ప్రదర్శన… ..కాలుష్య నివారణపై ప్రజలకు అవగాహన, పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ.

మంచిర్యాల:అర్జున్ సమాచారం నవంబర్ 6 డెస్క్.

కాలుష్య రహిత ,దీపావళిని జరుపుకోవాలని, పర్యావరణానికి హాని కలిగించే బాణసంచాకు దూరంగా ఉండాలని ప్రకృతిమిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ వాల్టా అథారిటీ సభ్యుడు, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ పిలుపునిచ్చారు. శుక్రవారం (నవంబర్ 6) కలెక్టరేట్ రోడ్డులోని ప్రకృతిమిత్ర రాష్ట్ర కార్యాలయ ఆవరణలో కాలుష్య రహిత దీపావళి నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మట్టి ప్రమిదలతో వెలిగించిన నూనె దీపాలను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాలుష్య నివారణ, ప్రకృతి హితమైన దీపావళి నిర్వహణపై నినాదాలు చేశారు. అనంతరం పాల్గొన్న ప్రజలతో కాలుష్య రహిత దీపావళి ప్రతిజ్ఞ చేయించారు. టపాసులకు బదులుగా మట్టి దీపాలు వెలిగించి సంప్రదాయ పద్ధతిలో పండుగ జరుపుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ.. దీపావళి అంటే నూనె దీపాల వరుస అని, కాలుష్యాన్ని వెదజల్లే బాంబుల వరుస కాదని అన్నారు. భారతీయ సంప్రదాయంలో దీపాలకు ప్రత్యేక స్థానం ఉందని, ఆ సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే ప్రకృతికి, మూగజీవాలకు హాని కలగకుండా పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మట్టి ప్రమిదల్లో నూనె దీపాలు వెలిగించి ఆనందంగా దీపావళిని జరుపుకోవాలని కోరారు.
బాణసంచా వల్ల వెలువడే పొగ, శబ్దం గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు, మూగజీవాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వాయు కాలుష్యం కారణంగా గుండె, నాడీ వ్యవస్థ, కంటి, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాలను గౌరవిస్తూ కాలుష్యానికి కారణమయ్యే టపాసులను స్వచ్ఛందంగా నివారించాలని పిలుపునిచ్చారు.
అగ్నిమాపక, అటవీ శాఖలకు చెందిన అధికారులు సత్యనారాయణ, రమేష్ బాబు, సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. బాణసంచా వల్ల గాలి, శబ్ద, నీటి కాలుష్యం అధికమవుతుందని తెలిపారు. పండుగ సందర్భంగా బాణసంచా వినియోగాన్ని పూర్తిగా నివారించడం మంచిదని, తప్పనిసరి పరిస్థితుల్లో గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే పరిమితంగా వినియోగించాలని సూచించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 101 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు తెలిపారు. ప్రకృతిమిత్ర సంస్థ నిరంతరం నిర్వహిస్తున్న పర్యావరణ అవగాహన కార్యక్రమాలను వారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మహిళలు రాచకొండ చందన, చిప్ప జ్యోతి, స్వర్ణలత, హేమ మాట్లాడుతూ.. దీపావళిని కాలుష్యానికి తావులేకుండా సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. టపాసులు, బాంబులు, చిచ్చుబుడ్లకు బదులుగా దీపాలు వెలిగించి కేదారేశ్వరి అమ్మవారిని పూజిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.