ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అక్రమ మట్టి తవ్వకాలు,విజిలెన్స్‌కు ఫిర్యాదు.

రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అక్రమ మట్టి తవ్వకాలు,విజిలెన్స్‌కు ఫిర్యాదు.

అర్జున్ సమాచారం// అక్టోబర్ 3// రామగిరి. రిపోర్టర్.

మంథని, అక్టోబర్ 3: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామ సమీపంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూముల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేత జరుగుతున్నాయంటూ మంథనికి చెందిన పుట్ట ముకేష్ తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆదివారంపేట రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మెఘా ఇంజనీరింగ్‌ సంస్థకు సంబంధించిన వారు అనుమతులు లేకుండా భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు చేపట్టి, చెట్లను తొలగించి తరలిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించినట్లు పేర్కొన్నారు. అలాగే సింగరేణి ఓసీ-2, ఓసీ-3 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఓబీ మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు.

ఈ తవ్వకాలు ఈడీ మైన్స్‌ అండ్‌ జియాలజీ, పెద్దపల్లి అధికారుల సహకారంతో జరుగుతున్నాయన్న ఆరోపణలపై కూడా విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణంలో భాగంగా సింగరేణి బ్లాస్టింగ్‌ ద్వారా తొలగించిన, బొగ్గు కలిసిన నాసిరకం మట్టి (గ్రావెల్‌)ను రోడ్డు నిర్మాణం, స్ట్రెంతెనింగ్‌ పనులకు వినియోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక సబ్‌కాంట్రాక్టర్‌ను నియమించి, అనుభవం లేని వారితో పనులు చేయిస్తూ నాణ్యతా ప్రమాణాలు, టెండర్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరపాలని కోరారు.

ఈ వ్యవహారంలో ఇంజనీరింగ్‌, మైనింగ్‌, అటవీ శాఖ అధికారుల పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని, అక్రమంగా తరలించిన మట్టి, తొలగించిన చెట్లకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని విజిలెన్స్‌ అధికారులను కోరినట్లు తెలిపారు. ఆరోపణలు రుజువైతే బాధ్యులైన సంస్థలు, అధికారులు, కాంట్రాక్టర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.