ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 3:05 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాజాపూర్‌లో అవార్డు ప్రక్రియపై గందరగోళం.ఒకే గ్రామానికి రెండు అవార్డులు ఎందుకు? – గ్రామస్థుల ప్రశ్న ,ఇళ్లకు RTH నంబర్లు ఉన్నా ఖాళీ స్థలాలుగా నమోదు చేయడంపై ఆందోళన.

రాజాపూర్‌లో అవార్డు ప్రక్రియపై గందరగోళం.ఒకే గ్రామానికి రెండు అవార్డులు ఎందుకు? – గ్రామస్థుల ప్రశ్న ,ఇళ్లకు RTH నంబర్లు ఉన్నా ఖాళీ స్థలాలుగా నమోదు చేయడంపై ఆందోళన.

రాజాపూర్: పెద్దపల్లి, అర్జున్ సమాచారం డెస్క్, సెప్టెంబర్ 23.

సింగరేణి సంస్థకు భూముల స్వాధీనం ప్రక్రియలో భాగంగా రాజాపూర్ గ్రామంలో జరుగుతున్న సర్వే, అవార్డు ప్రక్రియపై గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకే గ్రామానికి సంబంధించి రెండు అవార్డులు రూపొందించడంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

గ్రామస్థుల వివరాల ప్రకారం, కొన్ని ఇళ్లకు ఇప్పటికే RTH నంబర్లు ఉన్నప్పటికీ, సంబంధిత స్థలాలను ఖాళీ స్థలాలుగా చూపించారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు RPN నంబర్లు ఇచ్చిన కొన్ని ప్రాంతాల విషయంలో కూడా తమను గ్రామానికి సంబంధం లేని వారిగా చూపించే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలోని ఇళ్లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలు, చెట్లు, బావులు, ఇతర నిర్మాణాలు మరియు ప్రజల వినియోగంలో ఉన్న భూములకు సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో నమోదు కాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. సర్వే సమయంలో తమ అభ్యంతరాలు, వాస్తవ పరిస్థితులను అధికారులు పూర్తిగా పరిశీలించాలని వారు కోరుతున్నారు.

అధికారుల నుంచి స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్

గ్రామంలో భూముల సర్వే, PN, PD, RTH, RPN వంటి నమోదులపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులు సమావేశం ఏర్పాటు చేసి ప్రతి అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.

గ్రామానికి సంబంధించిన ప్రతి ఇల్లు, చెట్టు, బావి, ఇంటి పక్కన ఉన్న భూమి తదితర ఆస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ వివరాలన్నీ అవార్డులో నమోదు చేస్తే తాము పూర్తిగా సహకరిస్తాం” అని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా సమస్యలు ఎందుకు?

సింగరేణి సంస్థకు భూముల స్వాధీనం ప్రక్రియలో తాము సహకరిస్తామని గ్రామస్థులు చెబుతున్నప్పటికీ, సర్వే మరియు అవార్డు ప్రక్రియలో ఏర్పడుతున్న గందరగోళం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

తమ సమస్యలకు పరిష్కారం లభించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు వంటి ఆందోళనలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే గ్రామస్థులతో సమావేశమై ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, హక్కులు, పరిహారం తదితర అంశాలపై స్పష్టత ఇస్తే సమస్యలు తలెత్తకుండా పరిష్కరించవచ్చని వారు సూచిస్తున్నారు.

“సర్వస్వం కోల్పోతున్న కుటుంబాలకు న్యాయం చేయాలి”

భూములు, ఇళ్లు, ఇతర ఆస్తులు కోల్పోతున్న కుటుంబాలకు నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ జీవనాధారాన్ని కోల్పోతున్న కుటుంబాలకు సరైన పరిహారం, అర్హతలకు అనుగుణంగా పునరావాసం, ఇతర ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా బొగ్గు తవ్వకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉన్నందున, భూములు కోల్పోతున్న స్థానిక ప్రజల ప్రయోజనాలను కూడా సమానంగా పరిగణించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజల డిమాండ్ ఒక్కటే… స్పష్టత, పారదర్శకత

మేము అభివృద్ధికి, సింగరేణి ప్రాజెక్టుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మా ఇళ్లు, భూములు, చెట్లు, బావులు, ఇతర ఆస్తులకు సంబంధించిన వాస్తవ వివరాలను సరిగ్గా నమోదు చేసి, నిబంధనల ప్రకారం న్యాయం చేయాలి” అని రాజాపూర్ గ్రామస్థులు కోరుతున్నారు.

అవార్డు ప్రక్రియలో ఉన్న సందేహాలను నివృత్తి చేసి, గ్రామస్థుల సమక్షంలో పూర్తి వివరాలను వెల్లడించి, పారదర్శకంగా ప్రక్రియను కొనసాగించాలని వారు అధికారులను కోరుతున్నారు.