రాజ్యంగ సవరణ ఫిక్స్…
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 27.
చరిత్ర ఎప్పుడూ పాత గణాంకాల వద్ద ఆగిపోదు. పెరిగిన ప్రజల ఆశయాలకు తగ్గట్లుగా ప్రజాస్వామ్య వేదికను విస్తరించడమే నిజమైన రాజనీతిజ్ఞత.”1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించిన 543 లోక్‌సభ స్థానాలతోనే నేటికీ దేశం నడుస్తుండటం పార్లమెంటరీ వ్యవస్థలోని అసమతుల్యతకు నిదర్శనం. అప్పటికీ ఇప్పటికీ దేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య లక్షల నుంచి కోట్ల స్థాయికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన జనాభాకు న్యాయం చేయాలని, ప్రాతినిధ్య ప్రాతిపదికను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ సహా విపక్షాలు మాత్రం పాత పల్లవినే అందుకుంటున్నాయి. “ఉన్న సీట్లను అలాగే ఉంచండి.. పునర్విభజన వద్దు” అంటూ అవి చేస్తున్న వాదనలో ప్రజాస్వామ్య స్పృహ, పరిపాలనా సంస్కరణల కంటే రాజకీయ స్వార్థం, అభద్రతాభావమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు నియోజకవర్గాల పునర్విభజన ఎందుకు అత్యవసరమో పరిశీలిస్తే, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. జనాభా విపరీతంగా పెరిగిన చోట ఒకే ప్రజాప్రతినిధిపై పనిభారం పెరిగి, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఇక ‘ప్రో-రేటా’ విధానం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగేలా చూడవచ్చు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయాన్ని శిక్షగా మార్చకుండా, ఆయా రాష్ట్రాల ప్రస్తుత సీట్ల వాటా తగ్గకుండా నిష్పత్తి ప్రకారం సీట్లను పెంచే సమతూక విధానంతో దక్షిణాది ప్రయోజనాలను పూర్తిగా కాపాడవచ్చు. నిజానికి, ఏ విధానపరమైన చర్చా లేకుండానే డీలిమిటేషన్‌పై దక్షిణాదిలో భయాందోళనలు రేకెత్తించాలని విపక్షాలు చేస్తున్న ప్రయత్నాల్లోని డొల్లతనం ఇట్టే బయటపడుతోంది. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించేందుకు రాజ్యాంగ సవరణల ద్వారా పునర్విభజనను వాయిదా వేసిన మాట వాస్తవమే అయినా, శాశ్వతంగా జనాభా వాస్తవాలను విస్మరించడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. నూతన పార్లమెంటు భవనం విస్తృత ప్రాతినిధ్యానికి వీలుగా నిర్మితమైనందున ,పారదర్శకతతో కూడిన, అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసే డీలిమిటేషన్ ప్రక్రియపై నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైంది.ఒకసారి గణాంకాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. 1971 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా సుమారు 54.8 కోట్లు. అప్పుడు సగటున 10 లక్షల మంది పౌరులకు ఒక లోక్‌సభ సభ్యుడు ప్రాతినిధ్యం వహించేవారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా జనాభా నియంత్రణను ప్రోత్సహించే ఉద్దేశంతో సీట్ల సంఖ్యను 543 వద్ద స్తంభింపజేశారు. ఆ తర్వాత 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ గడువును 2026 తర్వాత జరిగే మొదటి జనగణన వరకు పొడిగించారు. నేడు 2026 నాటికి భారతదేశ జనాభా 145 కోట్ల మార్కును దాటేసింది. అంటే 1971 నాటి జనాభాకు, నేటి జనాభాకు ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదు! నేడు ఒక లోక్‌సభ ఎంపీ సగటున 26 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. కొన్ని నగర నియోజకవర్గాల్లో ఉదాహరణకు మల్కాజిగిరి లేదా బెంగళూరు నార్త్ వంటి చోట్ల ఓటర్ల సంఖ్యే 30 లక్షలకు పైగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో, ఒక ఎంపీ ఇంత భారీ జనాభా సమస్యలను పార్లమెంటులో ఎలా వినిపించగలరు? అమెరికా కాంగ్రెస్‌లో ప్రతి 7.8 లక్షల మందికి ఒక ప్రతినిధి ఉంటే, మనం మాత్రం 30 లక్షల మందికి ఒక ఎంపీని ఇచ్చి చేతులు దులుపుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. కనీసం కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సంఖ్యను పెంచుతున్న మనం, చట్టసభల సభ్యుల సంఖ్యను 55 ఏళ్లుగా పెంచకపోవడం ఏ రకమైన న్యాయం?నియోజకవర్గాల పునర్విభజన అనగానే విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు ప్రధానంగా లేవనెత్తుతున్న భయం జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుంది అన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం కేవలం ప్రస్తుత జనాభా నిష్పత్తిలోనే సీట్లు విభజిస్తే ఆ ఆందోళనలో కొంత అర్థం ఉండేది.ఒకవేళ 543 సీట్లను నేటి జనాభా ప్రకారం పంచితే, దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని కార్నెగీ ఎండోమెంట్, పీఆర్ఎస్ వంటి సంస్థలు విశ్లేషించాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అది కాదు! కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా, బహిరంగ వేదికల మీదా స్పష్టమైన హామీ ఇచ్చారు—”ప్రో-రేటా పద్ధతిలో సీట్లను పెంచుతాం. ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రం కూడా తనకున్న ఒక్క సీటును గానీ, తన ప్రస్తుత ప్రాతినిధ్య శాతాన్ని గానీ కోల్పోదు” అని. తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే, ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి . పార్లమెంటులో వాటా 4.60% నుంచి 4.65%కి చేరుతుంది. అలాగే తెలంగాణ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి . వాటా 3.13% నుంచి 3.18%కి ఎగబాకుతుంది . పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో సీట్లు 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కి చేరుకుంటాయి. మొత్తంగా చూస్తే, దక్షిణాది రాష్ట్రాల మొత్తం లోక్‌సభ సీట్లు 129 నుంచి 195కి పెరగడమే కాకుండా, మొత్తం సభలో దక్షిణాది వాటా 23.76 శాతం నుంచి 23.87 శాతానికి స్వల్పంగా పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గదు. . దేశంలో 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు నారీ శక్తి వందన్ అధినేయం అమలు కావాలన్నా, కొత్త నాయకత్వం ఎదగాలన్నా డీలిమిటేషన్ అనివార్యం. పాత నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులను అలాగే ఉంచడం వల్ల—దశాబ్దాలుగా కొన్ని కుటుంబాలు, కొందరు పాత నేతలు తమ గుప్పిట్లో పెట్టుకున్న ‘సేఫ్ సీట్లు’ చెక్కుచెదరకుండా ఉంటాయన్నది కాంగ్రెస్ ఆలోచన. అంతేకాదు, 2002–2008 మధ్య యూపీఏ హయాంలో 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల లోపల నియోజకవర్గాల సరిహద్దులు మార్చినప్పుడు లేని అభ్యంతరం, ఇప్పుడు సీట్ల సంఖ్య పెంచుతామంటే ఎందుకు వస్తోందిప్రజాస్వామ్యంలో గడియారపు ముల్లును వెనక్కి తిప్పడం సాధ్యం కాదు. మారుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగకపోతే, ప్రజల గొంతుక పార్లమెంటు గడప దాటలేక మూగబోతుంది. 1971 నాటి పాత లెక్కల చొక్కాను 2026 నాటి యువ భారతానికి తొడగాలనుకోవడం అవివేకం. నిష్పత్తి తగ్గకుండా, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘ప్రో-రేటా’ డీలిమిటేషన్ విధానం దేశ సమైక్యతకు, ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనం. అపోహల పొగమంచును తొలగించి, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను పక్కనపెట్టి—కొత్త తరం అవసరాలకు తగ్గట్టుగా చట్టసభలను విస్తరించుకోవడం నేడు ప్రతి భారతీయుడి బాధ్యత. డీలిమిటేషన్ అనేది ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క ప్రాంతానికో చెందింది కాదు; అది 145 కోట్ల మంది భారతీయుల గొంతుకను మరింత బలంగా వినిపించే ప్రజాస్వామ్య మహా యజ్ఞం!