ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 1:39 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గులాబీ వైపు..దానం చూపు

గులాబీ వైపు..దానం చూపు,

హైదరాబాద్, సెప్టెంబర్ 15, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 15,)

హైదరాబాద్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలి ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం, గడిచిన కొన్ని రోజులుగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపైనే బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక డ్రా కార్యక్రమంలో తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని ప్రోటోకాల్ రచ్చ చేయడం, అసెంబ్లీ సాక్షిగా తన స్నేహితుడు పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడటం రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ పాలనను, ఆయన విజన్‌ను పొగుడుతూ కామెంట్లు చేయడం చూస్తుంటే.. దానం నాగేందర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది.కాంగ్రెస్‌లో చేరి తనకు దక్కిందేమీ లేదనే తీవ్ర తీవ్ర నైరాశ్యంలో దానం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే డిగ్రేడ్ ఇమేజ్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ముప్పు కత్తిలా వేలాడుతుండటం, హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో సొంత పార్టీ నేతల నుంచే వస్తున్న ఆధిపత్య పోరుతో దానం తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్‌లో ఉండి సాధించేది ఏమీ లేకపోగా, నియోజకవర్గంలోనూ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందనే భావనతోనే ఆయన తిరిగి పాత గూటికి వెళ్లేందుకు సంకేతాలు ఇస్తున్నారనే విశ్లేషణలు ఉన్నాయి.
అయితే, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానం నాగేందర్‌ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అనేది? 2023 ఎన్నికల తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ మొదటి వరుసలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలోకి వెళ్లగానే మరోలా మారిన నేతలను తిరిగి చేర్చుకుంటే పార్టీ క్యాడర్‌కు ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే ఆలోచన బీఆర్ఎస్ అధిష్ఠానంలో ఉంది. దానం లాయలిటీ  పై కేసీఆర్‌కు ఏమాత్రం గురి లేకపోతే, ఆయనను కనీసం ఫార్మ్‌హౌస్‌లోకి కూడా రానివ్వరనే అభిప్రాయం ఉంది.మరో కోణంలో చూస్తే బీఆర్ఎస్‌కు హైదరాబాద్‌లో బలమైన మాస్ లీడర్ల అవసరం   ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దానం నాగేందర్‌కు దశాబ్దాలుగా సొంత క్యాడర్ ఉంది. నగరంలో బీఆర్ఎస్ బలాన్ని నిలబెట్టుకోవడానికి, బిసి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతగా దానం సేవలు ఉపయోగపడతాయని గులాబీ దళం భావిస్తే ఆయనకు తలుపులు తెరిచే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేయడానికి దానం లాంటి నేత తిరుగుబాట పట్టడం బీఆర్ఎస్‌కు రాజకీయంగా పెద్ద విజయం అవుతుంది.  ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఒకవేళ దానం మళ్లీ పార్టీలోకి వస్తే, ఇన్నాళ్లూ ఆయనను విమర్శించిన స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆయనతో కలసి పనిచేస్తారా అనేది మరో సవాలు.   కాంగ్రెస్‌లో ఇమడలేక, ప్రభుత్వ తీరుపై అసహనంతో ఉన్న దానం నాగేందర్ బీఆర్ఎస్ వైపు వంగి చూడటం హైదరాబాద్ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసీఆర్ మనసు కరిగి దానంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక నమ్మకం లేని నేత అని పక్కన పెడతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.