ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 6:31 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

డిమాండ్లు పరిష్కరించాలి.. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన..

డిమాండ్లు పరిష్కరించాలి.. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన..

అర్జున్ సమాచారం. ఆగస్టు 29. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల, ఆగస్టు 29 :రాష్ట్ర సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు కరవు భత్యాలను విడుదల చేయాలని కోరారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పన్నెండు వేల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు పదిహేడు శాతం ఇంటి అద్దె భత్యం కల్పించాలని కోరారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సెప్టెంబర్ 10వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయ పరిపాలన అధికారి కే. రమేష్, ఉద్యోగులు రవికిషోర్, సతీష్, పద్మశ్రీ, అనూష, వినోద్, మల్లేష్, జనార్దన్, జీనత్, షారుక్, మహేందర్, అరుణ, సుమంత్, రజిత, నరేష్, నరేందర్, రాజం, పోచం, పద్మ తదితరులు పాల్గొన్నారు.