ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 6:01 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

కుమరం భీమ్ వర్ధంతి ఏర్పాట్లను పర్యవేక్షించిన డిప్యూటీ డైరెక్టర్, జాదవ్ అంబాజీ.

కుమరం భీమ్ వర్ధంతి ఏర్పాట్లను పర్యవేక్షించిన డిప్యూటీ డైరెక్టర్, జాదవ్ అంబాజీ.

జోడేఘాట్‌లో ఏర్పాట్ల పరిశీలన..ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు

కెరమెరి: అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 18.

కుమరం భీమ్ :ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని చారిత్రక జోడేఘాట్‌లో శనివారం నిర్వహించనున్న ఆదివాసీ వీరుడు కుమరం భీమ్ వర్ధంతి కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వర్ధంతి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, ప్రజలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తూ, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

అదేవిధంగా, కార్యక్రమానికి హాజరయ్యే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. జనసందోహాన్ని నియంత్రించడం, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కొమరం భీమ్ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ పేర్కొన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికీ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమం లో ఐటీడీఏ ఏ పి ఓ ఆత్రం భాస్కర్, సి ఐ వేణుగోపాల్, ఎస్ ఐ రాజు ఏ టీ డి ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖతో పాటు పోలీస్ శాఖ, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.