ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 12:50 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

దేవాదాయశాఖ సెంటిమెంట్ కంటిన్యూ…

దేవాదాయశాఖ సెంటిమెంట్ కంటిన్యూ…

హైదరాబాద్, సెప్టెంబర్ 7, (అర్జున్ సమాచారం ప్రతినిధి)

రాజకీయాల్లో కొన్ని శాఖలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందులో దేవాదాయ ధర్మాదాయ శాఖది అత్యంత సున్నితమైన స్థానం. దేవుడి మాన్యాలు, ఆలయ పాలనతో ముడిపడి ఉండే ఈ పోర్ట్‌ఫోలియోను బాధ్యతగా భావించినా.. రాజకీయంగా మాత్రం మంత్రులకు అస్సలు కలిసిరావడం లేదు. ఇది త ఆరు దశాబ్దాల చరిత్ర చెప్తున్న చేదు నిజం. తాజాగా మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసనకు గురికావడంతో మరోసారి దేవాదాయ శాఖ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని ఇప్పటి ప్రత్యేక తెలంగాణ వరకు.. ఈ శాఖను చేపట్టిన పలువురు నేతల రాజకీయ ప్రస్థానం ఊహించని మలుపులు తిరిగి, క్రమంగా అస్తమించడమో లేదా తెరమరుగవడమో జరుగుతూ వస్తోంది.ఈ శాఖకు మంత్రుల పదవీకాలానికి ఉన్న విచిత్రమైన లింక్ 1962 నుంచే కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సదాలక్ష్మి కేవలం ఏడాది తిరిగేలోపే ఆ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. శాఖలో ఆమె తీసుకున్న సంస్కరణలు, నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో సంక్షేమ శాఖకు మార్చారు. ఆ వెంటనే 1967 ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. ఇక 1983 జనవరిలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ బాధ్యతలు చేపట్టిన ఈలి ఆంజనేయులు పదవిలో ఉండగానే కేవలం నెలల వ్యవధిలోనే అనారోగ్యంతో కన్నుమూశారు1999–2004 మధ్య చంద్రబాబు రెండోసారి సీఎంగా ఉన్న సమయంలో దామోదరం ఆంజనేయులు 1999లో దేవాదాయ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. 2001 నాటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాజకీయ సమీకరణాల్లో పదవి కోల్పోయారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన దండు శివరామరాజు 2004 సాధారణ ఎన్నికల్లో ఓటమి చెంది, ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఈ గండం కొనసాగింది. 2004-2005 మధ్య 14 నెలలపాటు బాధ్యతలు నిర్వర్తించిన ఎం.సత్యనారాయణ రావు.. హైదరాబాద్ పరిధిలోని దేవరయాంజాల్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని పదవిని వీడాల్సి వచ్చింది. క్రీడల శాఖకు మారినా, ఏడాదిలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం 2009 ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయి రాజకీయాలకు దూరమయ్యారు. వైఎస్ కేబినెట్‌లోనే 2009 మే నుంచి దేవాదాయ శాఖ నిర్వహించిన జూపల్లి కృష్ణారావు, 2011 జూన్ 1న తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అటు 2014లో ఏపీ టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఈ శాఖ చూసిన మాణిక్యాలరావు 2019 ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత ఆయన కన్నుమూశారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఏడాది పాటు ఎవరికీ ఈ బాధ్యతలు అప్పగించలేదు. 2014 డిసెంబరులో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి దేవాదాయ శాఖ దక్కింది. 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ రెండో కేబినెట్‌లోనూ 2023 ఎన్నికల వరకు ఆయనే కొనసాగినప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. సుదీర్ఘకాలం శాఖను నడిపించినా ఆయనకు రాజకీయంగా పెద్దగా మైలేజ్ దక్కలేదనే వాదన ఉంది.ఇక 2023 డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖలను చేపట్టిన కొండా సురేఖ సైతం పలు రాజకీయ వివాదాల్లో చిక్కుకుని అనూహ్యంగా మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. గతంలో కేసీఆర్ హయాంలో ఆరోగ్యశాఖ నిర్వహణ లోపాల వల్ల పదవి కోల్పోయిన డాక్టర్ టి.రాజయ్య, ఇప్పుడు పదవి కోల్పోయిన కొండా సురేఖ.. ఇద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలే కావడం కాకతాళీయం.సంక్షేమ పథకాలు, భారీ బడ్జెట్లు, రాజకీయ పలుకుబడిని పెంచే ఇతర శాఖలతో పోలిస్తే.. దేవాదాయ శాఖ పూర్తి భిన్నమైనది. భూముల వివాదాలు, ఆలయ నిధులు, స్థానిక ఆధిపత్య పోరు ఈ శాఖను నిరంతరం పర్యవేక్షణలో ఉంచుతాయి. కారణాలు పాలనాపరమైనవి కావొచ్చు, రాజకీయ సమీకరణాలు కావొచ్చు.. కానీ దేవాదాయ శాఖ పగ్గాలు పట్టిన నేతలకు కాలం కలిసిరావడం లేదన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుపోతోంది.