ఆటో డ్రైవర్ల బందుకు సంపూర్ణ మద్దతున్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి .తెలంగాణ రక్షణ సేన ప్రధాన నేత కల్వకుంట్ల కవిత.
హైదరాబాద్: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 22.
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఈ నెల 24వ తేదీ నుంచి చేపట్టనున్న బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన ప్రధాన నేత కల్వకుంట్ల కవిత తెలిపారు.
శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ కార్మిక సంఘం సహా పలు ఆటో సంఘాల నాయకులతో కలిసి బందు ప్రకటన పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలను ఇచ్చి చివరి దశ రవాణా సేవలను ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం జీవనోపాధి కోసం పనిచేస్తున్న ఆటో డ్రైవర్లతోనే చివరి దశ రవాణా సేవలను నిర్వహించాలని సూచించారు. కొత్తగా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల ఇప్పటికే ఉపాధి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆటో, రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా ప్రయాణ చార్జీలను పెంచాలని కోరారు. ప్రైవేటు రవాణా దరఖాస్తు సంస్థలకు బదులుగా ప్రభుత్వమే ప్రత్యేక దరఖాస్తును తీసుకురావాలని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం రూ.12 వేల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
శిశువు మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ద్వారా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఎక్కపల్లి తండాకు చెందిన గర్భిణికి సకాలంలో ప్రసవ సేవలు అందకపోవడం వల్లే శిశువు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శిశువును కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.