వారెంట్ ఉండగా ఐఏఎస్ అధికారులు విదేశాలకు ఎలా వెళ్తారు?ఎయిర్పోర్టులో అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి?
హైదరాబాద్అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 8.
తెలంగాణ ఐఏఎస్ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసేకరణ ప్రక్రియలో 50% పరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గతంలో హైకోర్టును బాధితులు ఆశ్రయించారు. పూర్తి పరిహారం చెల్లించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్లను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా పరిహారం చెల్లించలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో, అధికారులకు వ్యతిరేకంగా బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. అసెంబ్లీ సమావేశాల వల్ల అధికారులు కోర్టుకు రాలేరని న్యాయమూర్తికి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు.
బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పుడు అధికారులు విదేశాలకు వెళ్లి ఎలా తిరిగి వస్తారని, ఎయిర్పోర్టులో అరెస్ట్ చేస్తే ఏం చేసేవారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా బడ్జెట్ లేదని, నిధులు అందుబాటులో ఉన్నప్పుడు చెల్లిస్తామని, ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తామని చెప్పడం ఏంటని అసహనం వ్యక్తం చేసారు. ఇటీవలే పరిహారం చెల్లించామని క్షమించాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరడంతో, న్యాయమూర్తి కోర్టు ధిక్కరణ కేసును ముగించారు.