బంగారం ధర పతనం ఎన్నాళ్లు…బ్యాంకులు షాక్.
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24.
ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో రూ. 1.80 లక్షలు దాటిన బంగారం ధర, ఇప్పుడు వరుసగా పతనమవుతూ సామాన్య కొనుగోలుదారులకు ఊరటనిస్తుండగా, ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.22 లక్షల స్థాయికి పడిపోయి, గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 30 నుంచి 32 శాతం మేర దిగొచ్చింది. కమోడిటీ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ పతనానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడానికి బదులు మళ్లీ పెంచే అవకాశాలు ఉండటం, డాలర్ విలువ 19 నెలల గరిష్ఠానికి చేరి అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, అలాగే డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలపడటం. వీటికి తోడు,అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఏఐ షేర్ల పతనం వల్ల నగదు అవసరాల కోసం ఇన్వెస్టర్లు బంగారం పెట్టుబడులను విక్రయించడం కూడా ధరలపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.అయితే, ఈ పతనం ఎక్కడ ఆగుతుందన్న అంశంపై మార్కెట్ నిపుణులు కీలక సాంకేతిక స్థాయిలను సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధరకు 3,500 డాలర్ల వద్ద బలమైన మద్దతు ఉందని, ఒకవేళ ఆ స్థాయిని దాటి కిందికి పడిపోతే 3,300 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,500 స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే,బంగారం ధర రూ. 1 లక్ష కంటే దిగువకు పడిపోయే అవకాశాలు తక్కువే ప్రస్తుత ధరలు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నందున, పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లు , వాల్యూ బయింగ్ వల్ల త్వరలోనే తిరిగి కోలుకునే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు.దీర్ఘకాలికంగా అంటే ఏడాది తర్వాత 2027 చివరి నాటికి బంగారం ధరలు మళ్లీ పైకి ఎగబాకుతాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్ తాజా నివేదిక ప్రకారం, సమీప భవిష్యత్తులో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ, 2027 చివరి నాటికి వడ్డీ రేట్ల తగ్గింపు మొదలవుతుందని, అలాగే చైనా సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో 2027 నాటికి ఔన్సు బంగారం 4,650 డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇక దేశీయ మార్కెట్ అంచనాల ప్రకారం, 2027లో 10 గ్రాముల బంగారం ధర తిరిగి రూ. 1.60 లక్షల నుంచి రూ. 1.80 లక్షల శ్రేణిలోకి చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.బంగారం ధరల్లో ప్రస్తుత తగ్గుదల కేవలం అంతర్జాతీయ వడ్డీ రేట్లు, డాలర్ కదలికల వల్ల ఏర్పడిన తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని గోల్డ్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నారు. స్వల్పకాలంలో డిసెంబర్లో జరగబోయే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ నిర్ణయాల ఆధారంగా ధరల్లో మరికొంత ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, స్వల్పకాలిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడిగా లేదా అవసరాల కోసం బంగారం కొనాలనుకునే వారికి, ప్రస్తుత ధరల తగ్గుదలను ఉపయోగించుకుని విడతల వారీగా కొనుగోలు చేయడం ఉత్తమ వ్యూహమని నిపుణులు సూచిస్తున్నారు. మరో వైపు బంగారం ధరలు తగ్గుతున్నాయని కొనుగోలుదారులు సంతోషపడుతూ ఉంటే పసిడి తనకా పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు మొదలయ్యాయి. ధరలు భారీగా పడిపోవడంతో బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. అప్పుగా తీసుకున్న మొత్తానికి తనకా పెట్టిన బంగారం విలువకు మధ్య వ్యత్యాసం పెరగడంతో రుణ గ్రహీతలకు మార్జిన్ కాల్స్‌తో నోటీసులు పంపిస్తున్నారు. అదనంగా నగదు జమ చేయాలని లేదంటే మరికొంత బంగారం తనకా పెట్టాలని కోరుతున్నారు.గడిచిన 11 నెలల్లోనే బంగారం ధర 60,000కు పైగా తగ్గడంతో బ్యాంకులు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నాయి. బంగారం భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఆపద సమయంలో ఆదుకొనే ఆర్థిక భరోసా కూడా. అవసరమైతే నగలు బ్యాంకుల్లోనూ, ఫైనాన్స్ సంస్థల్లోనూ తనకా పెట్టి అప్పు తీసుకుంటూ ఉంటారు. అలా బంగారంపై రుణాలు ఇవ్వడం దేశంలో భారీ వ్యాపారంగా ఎదిగింది. అయితే, ఇప్పుడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ వ్యాపారానికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.పసిడి ధరలు పైపైకి వెళ్ళినప్పుడు బంగారంపై రుణాలు తీసుకున్న వారికి భారీగా నగదు అందింది. కానీ, ఇప్పుడు అదే బంగారం ధరలు దిగిరావడంతో రుణ గ్రహీతలకు కష్టాలు మొదలయ్యాయి. బంగారం తనకా పెట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్రమత్తమయ్యాయి. అప్పు ఇచ్చినప్పుడు ఉన్న బంగారం విలువ ఇప్పుడు తగ్గిపోవడంతో రుణాల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ ధరలు తగ్గడంతో బ్యాంకులు రుణ గ్రహీతలకు మార్జిన్ కాల్ నోటీసులు పంపిస్తున్నాయి. తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లించాలని కోరుతున్నారు. లేదంటే అధనంగా బంగారాన్ని తనకా పెట్టాలి అని సూచిస్తున్నారు. ధర తగ్గిన మేరకు రుణ మొత్తాన్ని తగ్గించుకోవాలని కొంత నగదును వెంటనే జమ చేయాలని కోరుతున్నారు. అంటే అప్పు తీసుకున్నప్పుడు ఉన్న లెక్కలు ఇప్పుడు మారిపోవడంతో ఖాతాదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది.ఇక బంగారం ధరలో ఈ ఎడాది భారీగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. జనవరిలో 10గ్రాముల బంగారం ధర రూ.1,85,000 మార్కును తాకింది. అలాగే ఫిబ్రవరి ప్రారంభంలో 1,40,000కు పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పుంజుకొని రూ.1,72,000కు చేరుకుంది. అనంతరం మరోసారి తగ్గుతూ వచ్చింది. ఇక ఆగస్టు చివరి వారం వరకు పెరుగుతూ వచ్చిన పసిడి ధర.. అక్కడి నుంచి మళ్ళీ పతనం బాటుపట్టింది. నవంబర్ ప్రారంభంలో రూ.1,50,000 స్థాయికి తగ్గగా తర్వాతి 20 రోజుల్లోనే రూ. 1, 25,000కు చేరింది. మొత్తంగా 11 నెలల్లో వ్యవధిలో రూ.60,000కుపైగా తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక భవిష్యత్తులో తులం ధర లక్ష రూపాయలకు చేరవచ్చన్న అంచనాలు రుణ సంస్థల్లో మరింత ఆందోళన పెంచుతున్నాయి.సాధారణంగా బ్యాంకులు తనకా పెట్టి బంగారం విలువలో 75శాతం నుంచి 80శాతం వరకు రుణంగా ఇస్తూ ఉంటారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. రుణ పరిమాణాన్ని బట్టి ఈ పరిమితులు మారుతాయి. అయితే బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో బ్యాంకులు ఇచ్చిన రుణాలకు ప్రస్తుతం తనకా బంగారం విలువకు మధ్య వ్యత్యాసం తగ్గిపోయింది. దీనికి వడ్డీ కూడా తోడవుతుంది. ఒకవేళ రుణగ్రహీతలు అప్పు చెల్లించకపోతే తనకా బంగారాన్ని వేలం వేసిన ఇచ్చిన మొత్తాన్ని పూర్తిగా రికవరీ చేయలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.అందుకే బ్యాంకులు ముందుగానే అప్రమత్తమయ్యాయి. మార్జిన్ కాల్స్ ద్వారా రుణ గ్రహీతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక మరోవైపు బంగారం ధరలు మరింత తగ్గితే కొంతమంది రుణ గ్రహీతులు అప్పు చెల్లించకుండా తనకా పెట్టిన ఆభరణాలు వదిలేసే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా బ్యాంకుల్లో వ్యక్తమవుతుంది. ఇక ఈ పరిస్థితుల్లో వేలం ద్వారా రుణాన్ని రికవరీ చేసుకోవడం కూడా కష్టంగా మారొచ్చు.