ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 7:01 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అంగన్‌వాడీ నియామకాల్లో రిజెక్ట్‌ చేసిన అభ్యర్థికి అవకాశం ఎలా.. నిబంధనలు అందరికీ సమానంగా వర్తింపజేయాలి: కోటపర్తి సౌందర్య

అంగన్‌వాడీ నియామకాల్లో రిజెక్ట్‌ చేసిన అభ్యర్థికి అవకాశం ఎలా.. నిబంధనలు అందరికీ సమానంగా వర్తింపజేయాలి: కోటపర్తి సౌందర్య

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగష్టు 12:

అంగన్‌వాడీ పోస్టుల నియామక ప్రక్రియలో నిబంధనలు అందరికీ సమానంగా వర్తించేలా చర్యలు తీసుకోవాలని వెంకటాపూర్ గ్రామానికి చెందిన అభ్యర్థి కోటపర్తి సౌందర్య డిమాండ్ చేశారు. బుధవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో 64 అంగన్‌వాడీ పోస్టులకు 1,285 మంది పోటీ పడుతున్న నేపథ్యంలో నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని కోరారు. తమ గ్రామానికి చెందిన ఓ అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు లేవనే కారణంతో రిజెక్ట్ చేశారని, దీనిపై గ్రామపంచాయతీ పరిధిలో నోటీసు కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే అనంతరం అదే అభ్యర్థి పేరు ఇంటర్వ్యూకు ఎంపికైన జాబితాలో కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సౌందర్య అన్నారు. మొదట రిజెక్ట్ చేసిన అభ్యర్థిత్వాన్ని ఏ నిబంధనల ప్రకారం తిరిగి పరిశీలించారు? అదనపు ధ్రువపత్రాలు సమర్పించారా? రిజెక్షన్ నిర్ణయాన్ని ఎవరు మార్చారు? అనే వివరాలను అధికారులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ లేదా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, దరఖాస్తు నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, రిజెక్షన్, అనంతరం ఇంటర్వ్యూ జాబితాలో పేరు చేర్చే వరకు జరిగిన ప్రక్రియను రికార్డుల ఆధారంగా పరిశీలించాలని కోరారు. అంగన్‌వాడీ నియామకాల్లో అందరికీ సమాన న్యాయం జరిగేలా, ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా నియామక ప్రక్రియను నిర్వహించాలని సౌందర్య డిమాండ్ చేశారు.