ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 6:09 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణి ఓ‌సి‌పి 2 విస్తరణ సర్వేలో అక్రమాలు: రాజపూర్ గ్రామ ప్రజల నిరసన, ఉద్రిక్తత

అర్జున్ సమాచారం, ఆగస్టు 20 :

పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని రాజపూర్ గ్రామంలో సింగరేణి ఓ‌సి‌పి 2 విస్తరణ కోసం నిర్వహించిన ఎంజాయ్‌మెంట్ సర్వే తీవ్ర వివాదాస్పదమైంది. ఈ సర్వే తప్పులతడకగా ఉందని, దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఒంటెద్దు పోకడ వల్ల తరతరాలుగా ఈ గ్రామాన్ని నమ్ముకుని బతుకుతున్న తమకు జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అక్రమ సర్వేను నిరసిస్తూ గ్రామస్థులు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు వైపు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకున్నారు, ఇది గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

సింగరేణి అధికారులు మరియు రెవెన్యూ యంత్రాంగం తమ రాజ్యాంగబద్ధమైన హక్కులకు భంగం కలిగిస్తున్నారని గ్రామస్థులు మండిపడ్డారు. మానవ హక్కులను ఉల్లంఘిస్తూ తప్పుడు సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్నారని, అధికారులు తమ మొండి వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు.

తాము బొగ్గును దేశ సంపదగా గౌరవిస్తామని, కానీ ప్రజలు కూడా దేశ సంపదే కదా అని గ్రామస్తులు ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే 2013 చట్టాన్ని ఉల్లంఘిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకుని, ప్రతి ఇంటికి సరైన నష్టపరిహారం అందేలా కరెక్ట్ ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించాలని పదే పదే కోరారు. లేనిపక్షంలో సింగరేణి సంస్థ మరియు ప్రభుత్వం మెడలు వంచి అయినా తమ హక్కులను సాధించుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు.

న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పోరాట యోధులుగా మిగిలిపోతామని, గతంలో అవార్డు క్యాన్సిల్ చేయించిన చరిత్ర కూడా తమ గ్రామానికి ఉందని వారు గుర్తు చేశారు. తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే వరకు, న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని గ్రామస్తులు దృఢంగా తెలిపారు. అధికారులు ప్రవర్తన వల్ల ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడిందని, దీనికి అధికారులే బాధ్యత వహించాలని వారు స్పష్టం చేశారు