ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 5:52 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాజాపూర్ ప్రజలకు న్యాయం చేయలేక పుట్ట మధును విమర్శించడం సరికాదు.

రాజాపూర్ ప్రజలకు న్యాయం చేయలేక పుట్ట మధును విమర్శించడం సరికాదు.

అర్జున్ సమాచారం.నవంబర్ 13.రామగిరి రిపోర్టర్.

బీఆర్ఎస్ హయాంలో గ్రామానికి చేసిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకులకు ప్రశ్నలు,

సింగరేణి బాధితులందరికీ పరిహారం అందేలా కృషి చేయాలి.. వ్యక్తిగత విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి.

రామగిరి మండలం సింగరేణి ప్రభావిత గ్రామమైన రాజాపూర్‌లో నెలకొన్న సింగరేణి సమస్యలపై ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ను కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించలేని నాయకులు, సమస్యలపై ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడం విడ్డూరంగా ఉందని వారు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులకు పలు ప్రశ్నలు సంధించారు.

బీఆర్ఎస్ హయాంలో రాజాపూర్‌కు అభివృద్ధి పనులు.

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో రాజాపూర్ గ్రామానికి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు బీఆర్ఎస్ నాయకులు గుర్తుచేశారు. రాజాపూర్ గ్రామపంచాయతీ ఏర్పాటు కావడంలో పుట్ట మధుకర్ కృషి ఎంతో ఉందని, గ్రామంలో సుమారు రూ.1.50 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో 80 శాతం వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మర్రి తువ్వ రోడ్డు, ఎస్సీ కాలనీ కెనాల్ గుడి నుంచి ఎరువక సంపత్ ఇంటి వరకు సీసీ రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు.

అలాగే ఎస్‌ఆర్‌ఎస్‌పీ డీ-83కెనాల్‌పై రూ.35 లక్షలకు పైగా వ్యయంతో వంతెన నిర్మాణం, గ్రామంలో సుమారు ఆరు బ్రిడ్జిల నిర్మాణం, మిషన్ కాకతీయలో భాగంగా రూ.60 లక్షలతో చెరువు పూడికతీత పనులు చేపట్టినట్లు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా, సుమారు రూ.20 లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం, అంగన్‌వాడీ భవనం, ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు.

వీటితో పాటు పేద కుటుంబాలకు వివాహాల సందర్భంగా ఆర్థిక సహాయం, పుస్తె మట్టెల అందజేత, గొర్రెల యూనిట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని తెలిపారు.

సింగరేణి పరిహారంపై సమాధానం చెప్పాలి,

గతంలో రాజాపూర్ ప్రజలకు సింగరేణి వల్ల జరిగే నష్టానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు బాధిత కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గ్రామంలో 800కు పైగా ఇళ్లు ఉండగా, 400కు పైగా ఇళ్లను పీడీ జాబితాలో చేర్చలేదని, అర్హులైన బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

పీడీ జాబితాలో ఇళ్లు రాని కుటుంబాలకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. పీఎన్‌లో నమోదైన 72 ఇళ్లు కూడా పీడీ జాబితాలోకి రాకపోవడంపై సమాధానం చెప్పాలని నిలదీశారు. రచ్చపల్లి, లాడ్నాపూర్, అక్కేపల్లి వంటి సింగరేణి ప్రభావిత గ్రామాల్లో బాధితులకు జరిగిన న్యాయం రాజాపూర్ ప్రజలకు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.

అధికార పార్టీ నాయకులను నిలదీయాలి.

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పిన నేపథ్యంలో, ఆయనపై విమర్శలు చేయడం మానుకొని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి బాధితుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. తమ నాయకుడిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ దొరకడం లేదని మీరే చెబుతున్నప్పుడు, సమస్య పరిష్కారం కోసం మరింత గట్టిగా ప్రయత్నించాల్సిన బాధ్యత కూడా మీపై ఉందని అన్నారు.

పేద కుటుంబాలు అప్పులు చేసి, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి నిర్మించుకున్న ఇళ్లకు పరిహారం అందక ఇబ్బందులు పడుతుంటే రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వడం తగదన్నారు. పుట్ట మధుకర్‌ను ప్రశ్నించడానికి చూపుతున్న చొరవను అధికారంలో ఉన్న నాయకులను ప్రశ్నించడానికి కూడా చూపాలని హితవు పలికారు.

తమ పోరాటం వ్యక్తుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, రాజాపూర్‌లో సింగరేణి కారణంగా నష్టపోతున్న ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం జరగడమే లక్ష్యమని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు పక్కనపెట్టి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లేల కిరణ్. బి ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాదాసీ రమేష్ యూత్ అధ్యక్షులు వేముల ప్రశాంత్ బి ఆర్ ఎస్ పార్టీ మాజీ జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ కలవేన సదానందం. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కలవేన రమేష్ నూనేటి లింగయ్య పోలవేన భీమయ్య వేల్పుల ఆంజనేయులు. బర్ల కుమార్ వేముల మల్లయ్య పుల్లెల మల్లయ్య పుల్లెల ప్రకాష్ పొట్ల సతీష్ కన్నూరి ప్రభాకర్. మచ్చరత్నం వేముల కుమార్ బొల్లం మల్లయ్య పుట్ట కనకయ్య సెగార్ల శంకర్. తదితరులు పాల్గొన్నారు