ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణిలో మహిళలకు రక్షణ కరువు.. యాజమాన్యం సమాధానం చెప్పాలి!మహిళలపై వేధింపులు ఆపాలి.. భద్రత కల్పించాలి

సింగరేణిలో మహిళలకు రక్షణ కరువు.. యాజమాన్యం సమాధానం చెప్పాలి!మహిళలపై వేధింపులు ఆపాలి.. భద్రత కల్పించాలి.

సమస్యను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం: బీజేపీ జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 20 | రామగిరి డెస్క్

సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, కార్మికులు, శిక్షణార్థులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మహిళలపై వేధింపులకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని, అధికారుల తీరు మారాలని ఆయన అన్నారు.

సింగరేణి గనులు, కార్యాలయాల్లో మహిళలు పనిచేస్తున్న ప్రాంతాల్లో అధికారిక ఒత్తిళ్లు, వేధింపులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యాజమాన్యం ఇకనైనా అప్రమత్తమై ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని కోరారు. గతంలోనూ సింగరేణిలో మహిళలకు వేధింపులు ఎదురైన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు, కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఇటీవల గోదావరిఖనిలో శిక్షణ పొందుతున్న 23 ఏళ్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ తంద్ర అక్షిత ఆత్మహత్య ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు సింగరేణి ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున పూర్తి వాస్తవాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.

సింగరేణి పరిధిలోని అన్ని ఏరియాలు, డివిజన్లలో మహిళా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ హెల్ప్‌లైన్, షీ టీమ్స్ వివరాలను మహిళలకు సులభంగా అందుబాటులో ఉంచాలని కోరారు.

మహిళా భద్రతకు సంబంధించిన ఈ సమస్యను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ములుమూరి శ్రీనివాస్ తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు దండే లక్ష్మీనారాయణ, మెరుగు శ్రీకాంత్, సెంటినరీ కాలనీ టౌన్ ప్రెసిడెంట్ తీగల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.