యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్.
అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // రామగిరి. రిపోర్టర్.
యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించాలని రామగుండం ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అన్నారు.
బుధవారం ఓసీపీ-2 ఉపరితల గనిలో టాటా హిటాచీ కంపెనీకి చెందిన సుమారు రూ.56.07 లక్షల విలువైన, 1.0 క్యూబిక్ మీటర్ సామర్థ్యం గల నూతన షావెల్ యంత్రాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కొత్త యంత్రాల కొనుగోలుకు అనుమతులు మంజూరు చేసిన సంస్థ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ భద్రతతో కూడిన ఉత్పత్తి సాధించాలని ఉద్యోగులకు సూచించారు. యంత్రాల్లో అమర్చిన రక్షణ పరికరాలను అవసరమైన సమయంలో తప్పనిసరిగా వినియోగించి ప్రమాదాలను నివారించాలని అన్నారు.
యంత్రాల మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలని, భద్రతా నిబంధనల విషయంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని సూచించారు. సీనియర్ ఉద్యోగులు తమ అనుభవం, నైపుణ్యాలను జూనియర్ ఉద్యోగులతో పంచుకుని వారికి పనిలో మెలకువలు నేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం. రామచంద్రరెడ్డి, కోట రవీందర్‌రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఏరియా ఇంజినీర్ ఎ. ఉదయభాస్కర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ జె. రాజశేఖర్, ఇన్చార్జి ప్రాజెక్ట్ ఇంజినీర్ సతీష్ చక్రవర్తి, మేనేజర్ భరత్‌కుమార్, టాటా హిటాచీ అధికారులు, ఇతర అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.