ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 2:09 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అత్యవసరంగా నిర్ణయం తీసుకోండి.. బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ కోసం షేక్ హసీనా దరఖాస్తు.

అత్యవసరంగా నిర్ణయం తీసుకోండి.. బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ కోసం షేక్ హసీనా దరఖాస్తు.

ఢిల్లీ:అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 20.

కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసిన షేక్ హసీనా
ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు లేఖ రాసిన లండన్ న్యాయవాది స్టీవెన్ పౌల్స్
మరణశిక్ష పడిన ఖైదీకి పాస్‌పోర్ట్ ఇచ్చేది లేదన్న బంగ్లాదేశ్ అధికారులు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు (ఎన్‌ఐసీ) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు ఆమె తరఫు న్యాయవాది అధికారికంగా లేఖ రాశారు. మీడియా కథనాల ప్రకారం… లండన్‌కు చెందిన ప్రముఖ బారిస్టర్ స్టీవెన్ పౌల్స్ ద్వారా హసీనా ఈ దరఖాస్తును సమర్పించారు. నవంబర్ 9న పంపిన తొలి విజ్ఞప్తికి స్పందన రాకపోవడంతో, నవంబర్ 19న ఆయన మరోసారి హైకమిషన్‌కు ఫాలో-అప్ లేఖ పంపారు. హసీనా స్వయంగా సంతకం చేసిన అధికార పత్రాన్ని (ఆథరైజేషన్ లెటర్) కూడా జతచేస్తూ, అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2024లో చెలరేగిన ప్రజా ఉద్యమం వల్ల భారత్‌కు వచ్చిన షేక్ హసీనా… డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రద్దయిన పత్రాల స్థానంలో కొత్త పాస్‌పోర్ట్, ఐడీ కార్డు కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు, హసీనా విజ్ఞప్తిని బంగ్లాదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. మానవతా వ్యతిరేక నేరాల కేసులో న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించిందని, పైకోర్టులో అప్పీల్ చేసుకునే గడువు కూడా ఇప్పటికే ముగిసిందని అధికారులు తెలిపారు. ఆమె ఒక దోషి అని, ఎలాంటి పరిస్థితుల్లోనూ కొత్త పాస్‌పోర్ట్ జారీ చేయబోమని బంగ్లాదేశ్ చీఫ్ ప్రాసిక్యూటర్ అమీనుల్ ఇస్లాం, న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారు. భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక నేరస్థుల అప్పగింత ఒప్పందం ద్వారానే ఆమెను రప్పించి, చట్టపరంగా శిక్షను అమలు చేస్తామని బంగ్లాదేశ్ వర్గాలు పేర్కొన్నాయి.